గాయని కల్పనపై అసత్య ప్రచారం.. మహిళా కమిషన్‌కు ఫిర్యాదు!
ప్రముఖ గాయని కల్పన తనపై సోషల్ మీడియాలో జరుగుతున్న అసత్య ప్రచారాన్ని నిలువరించాలంటూ తెలంగాణ మహిళా కమిషన్‌ను ఆశ్రయించారు. ఆమె ఆరోగ్య పరిస్థితిని తప్పుగా చిత్రీకరిస్తూ, వాస్తవాలను నిర్దిష్టంగా తెలుసుకోకుండా ఆన్‌లైన్ వేదికల ద్వారా తప్పుడు వార్తలు వ్యాప్తి చెందుతున్నాయని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.
ఇటీవల నిద్రమాత్రలు అధిక మోతాదులో తీసుకోవడంతో అపస్మారక స్థితిలోకి వెళ్లిన కల్పనపై, ఆమె కుటుంబ సభ్యుల వల్లే ఆత్మహత్యాయత్నం చేశారంటూ సోషల్ మీడియాలో పలు కథనాలు వెలువడ్డాయి. ఈ ప్రచారంపై ఆగ్రహం వ్యక్తం చేసిన ఆమె, నిరాధారమైన ఆరోపణలు చేస్తూ తన మనోభావాలను దెబ్బతీసేలా వ్యవహరిస్తున్నవారిపై చర్యలు తీసుకోవాలని మహిళా కమిషన్‌ను కోరారు.
ఈ సందర్భంగా మహిళా కమిషన్ చైర్మన్ స్పందిస్తూ, మహిళలపై అసత్య ప్రచారం చేసే వారిపై కఠిన చర్యలు తీసుకునేందుకు కట్టుదిట్టమైన వ్యూహాన్ని అమలు చేస్తున్నామని తెలిపారు. సోషల్ మీడియాలో బాధ్యతారహితంగా పోస్టులు పెడితే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించారు.