సితార సంస్థలో ‘వాయుపుత్ర’
ఇండియన్ సినీ ఇండస్ట్రీలో ఇప్పుడు కొత్త తరహా ట్రెండ్ మొదలైంది. హీరోల హవా కాకుండా, పురాణాలు–ఇతిహాసాల ఆధారంగా యానిమేషన్ సినిమాలు ప్రేక్షకుల ముందుకు వస్తున్నాయి.;
ఇండియన్ మూవీస్ లో ఇప్పుడు కొత్త తరహా ట్రెండ్ మొదలైంది. హీరోల హవా కాకుండా, పురాణాలు–ఇతిహాసాల ఆధారంగా యానిమేషన్ సినిమాలు ప్రేక్షకుల ముందుకు వస్తున్నాయి. ‘మహావతార్ నరసింహా’ వంటి చిత్రం కేవలం రూ.15 కోట్ల బడ్జెట్‌తో రూపొందినా, రూ.300 కోట్లకు పైగా గ్రాస్ సాధించి రికార్డులు క్రియేట్ చేసింది. ఇదే స్పూర్తిగా ఇప్పుడు మరో మహత్తరమైన ప్రాజెక్ట్ అనౌన్స్ అయ్యింది.
సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్ పై సూర్యదేవర నాగవంశీ నిర్మాణంలో, దర్శకుడు చందూ మొండేటి దర్శకత్వంలో ‘వాయుపుత్ర’ పేరుతో ఓ భారీ 3D యానిమేషన్ మూవీ రూపొందనుంది. ఈ చిత్రం హనుమంతుడి జీవితం ఆధారంగా వస్తోంది. హనుమంతుడిని ‘సప్త చిరంజీవులలో ఒకరు, శాశ్వత యోధుడు, భక్తి–బలం కలయిక‘గా చూపించేలా ఈ కథను మలచబోతున్నట్లు తెలుస్తోంది.
‘వాయుపుత్ర కేవలం సినిమా కాదు. ఇది పవిత్ర దృశ్యం. మన చరిత్ర యొక్క ఆత్మ నుండి, మన ఇతిహాసాల పుటల నుండి జీవం పోసుకున్న కథ‘ అని నిర్మాత నాగవంశీ చెప్పారు. ఈ చిత్రం తెలుగు, హిందీ, తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో ఒకేసారి విడుదల కానుంది. 2026 దసరా కానుకగా ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు.