‘బాహుబలి‘ ఆఫర్‌పై బోనీ కపూర్ క్లారిటీ

2015లో విడుదలైన ‘బాహుబలి‘ భారతీయ సినీ చరిత్రలోనే మైలు రాయిగా నిలిచిన చిత్రం. ఈ చిత్రంలోని ప్రతి పాత్రకు ఓ ప్రత్యేకమైన గుర్తింపు వచ్చింది.;

By :  S D R
Update: 2025-09-09 12:12 GMT

2015లో విడుదలైన ‘బాహుబలి‘ భారతీయ సినీ చరిత్రలోనే మైలు రాయిగా నిలిచిన చిత్రం. ఈ చిత్రంలోని ప్రతి పాత్రకు ఓ ప్రత్యేకమైన గుర్తింపు వచ్చింది. ముఖ్యంగా శివగామి పాత్రలో రమ్యకృష్ణ నటన మరపురానిది. కానీ మొదట ఈ పాత్రను దివంగత శ్రీదేవికి ఆఫర్ చేశారని అప్పట్లో వార్తలు వచ్చాయి.

అయితే, ఆమె అనేక రకాల డిమాండ్లు పెట్టిందని, హోటల్ ఫ్లోర్ మొత్తం కావాలందని వచ్చిన రూమర్లను ఆమె భర్త బోనీ కపూర్ తాజాగా ఖండించారు. ఆయన మాటల్లో ‘బాహుబలి నిర్మాతలు ఆఫర్ చేసిన మొత్తం, శ్రీదేవి అంతకుముందు చేసిన ‘ఇంగ్లీష్ వింగ్లీష్‘ సినిమా పారితోషికం కంటే తక్కువ. ఇంత క్రేజ్ ఉన్న నటిగా ఉన్నప్పుడు ఎందుకు తక్కువకు ఒప్పుకోవాలి? కనీసం ఆ సినిమా కన్నా ఎక్కువ రెమ్యునరేషన్ ఉండాలి‘ అన్నారు.

అలాగే ‘బాహుబలి‘ నిర్మాతలతో ఏర్పడిన చిన్న చిన్న అపార్థాలే ఈ ప్రాజెక్ట్‌ నుంచి శ్రీదేవి వెనక్కి తగ్గడానికి కారణమని చెప్పారు. అయితే చివరికి రమ్యకృష్ణ చేసిన శివగామి పాత్రకు చాలా మంచి పేరు వచ్చింది.

మరోవైపు.. శ్రీదేవి చివరిసారిగా నటించిన చిత్రం ‘మామ్‘ గురించి పలు ఆసక్తికర విశేషాలు లేటెస్ట్ ఇంటర్యూలో పంచుకున్నారు బోనీ కపూర్. ఏఆర్ రెహమాన్‌ను ఈ సినిమాకి తీసుకోవాలని శ్రీదేవి పట్టుబట్టినప్పుడు, ఆయన పారితోషికం ఎక్కువ కావడంతో బడ్జెట్ సమస్య తలెత్తింది. దాంతో, శ్రీదేవి తన రెమ్యునరేషన్ నుంచి సుమారు రూ.70 లక్షలు వదులుకోవడానికి సిద్ధమైందని బోనీ తెలిపారు.

ఇక ‘బదాయి హో‘ ఫేం అమిత్ శర్మ దర్శకత్వంలో, అజయ్ దేవగణ్ హీరోగా రూపొందిన ‘మైదాన్‘ బోనీ కపూర్ డ్రీమ్ ప్రాజెక్ట్. భారత ఫుట్‌బాల్ దిగ్గజం సయ్యద్ అబ్దుల్ రహీమ్ జీవితాన్ని తెరపైకి తీసుకొచ్చారు. అయితే, ఈ సినిమాకు బడ్జెట్ అదుపుతప్పడం పెద్ద సమస్యగా మారిందట. కొవిడ్ కారణంగా షెడ్యూళ్లు దెబ్బతినడంతో రూ.120 కోట్ల బడ్జెట్‌గా ప్లాన్ చేసిన సినిమా చివరికి రూ.210 కోట్లకు చేరింది. తుపాను వల్ల సెట్ ధ్వంసం వంటి అనుకోని వ్యయాలు బోనీ కపూర్ ను బాగా కుదిపేశాయట. చివరికి విమర్శకుల ప్రశంసలు వచ్చినా, బాక్సాఫీస్ వద్ద కేవలం రూ.68 కోట్ల కలెక్షన్‌తో భారీ నష్టాన్ని మిగిల్చిందట ‘మైదాన్‘ చిత్రం.

Tags:    

Similar News