బాలకృష్ణకు మరో అరుదైన గౌరవం
తెలుగు సినీ పరిశ్రమలో అగ్రనటుడిగా, రాజకీయ రంగంలో ప్రజాసేవకుడిగా ప్రత్యేక గుర్తింపు సంపాదించిన నందమూరి బాలకృష్ణ మరో అరుదైన రికార్డును సొంతం చేసుకున్నారు.;
తెలుగు సినీ పరిశ్రమలో అగ్రనటుడిగా, రాజకీయ రంగంలో ప్రజాసేవకుడిగా ప్రత్యేక గుర్తింపు సంపాదించిన నందమూరి బాలకృష్ణ మరో అరుదైన రికార్డును సొంతం చేసుకున్నారు. దేశ ఆర్థిక రాజధాని ముంబైలోని నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ (ఎన్ఎస్ఈ)లో ట్రేడింగ్ ప్రారంభానికి సంకేతంగా మోగించే గంటను బసవతారకం ఇండో-అమెరికన్ క్యాన్సర్ ఆసుపత్రి ప్రతినిధులతో కలిసి బాలకృష్ణ మోగించారు. ఈ ఘనతను దక్కించుకున్న తొలి దక్షిణాది నటుడిగా ఆయన చరిత్రలో నిలిచారు.
ఈ సందర్భాన్ని ఆయన 'ఇది నా వ్యక్తిగత విజయం కాదని, మన తెలుగు ప్రజల ఆత్మగౌరవానికి ప్రతీక'గా అభివర్ణించారు. గతంలో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, నటుడు అజయ్ దేవ్‌గణ్ వంటి ప్రముఖులు కూడా ఈ గంటను మోగించిన సంగతి తెలిసిందే.
సినీ కెరీర్‌లో 50 ఏళ్లు పూర్తి చేసుకున్న తరుణంలో, ప్రజా సేవలోనూ, క్యాన్సర్ బాధితుల కోసం చేసిన కృషిలోనూ బాలకృష్ణకు ఈ గుర్తింపు లభించడం విశేషం. ఇటీవలే ఆయన లండన్‌లోని వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లో చోటు సంపాదించగా, ఇప్పుడు ఎన్ఎస్ఈ గౌరవం కూడా ఆయన ఖాతాలో చేరింది.
ఇక బాలయ్య హీరోగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'అఖండ 2: తాండవం' డిసెంబర్‌లో ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశాలున్నాయి. తెరపై మాస్ యాక్షన్‌తో అలరించనున్న బాలయ్య, నిజ జీవితంలో కూడా ప్రత్యేక రికార్డులతో తెలుగు ప్రజలకు గర్వకారణంగా నిలుస్తున్నారు.