తల్లీకొడుకుల సెంటిమెంట్ వర్కవుట్ అవుతుందా?
కళ్యాణ్ రామ్ కథానాయకుడిగా నటిస్తున్న “అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి” చిత్రం తల్లీకొడుకుల సెంటిమెంట్ ప్రధానంగా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.;
ఇండియన్ ఇండస్ట్రీలో తల్లీకొడుకుల అనుబంధం నేపథ్యంలో సెంటిమెంట్ పండించిన చిత్రాలు బాక్సాఫీస్ వద్ద ఘన విజయం సాధించిన ఉదాహరణలు ఎన్నో ఉన్నాయి. ఇటీవల ‘కేజీఎఫ్, సలార్ మొదటి భాగం’ సినిమాలు ఈ ఫార్ములాతో ఎంత పెద్ద విజయాన్ని అందుకున్నాయో అందరికీ తెలిసిందే. యష్, ప్రభాస్ పాత్రలు తల్లికోసం తపన పడడం ఆ రెండు సినిమాలకూ హైలైట్ గా నిలిచిపోయాయి.
ఇప్పుడు కళ్యాణ్ రామ్ కథానాయకుడిగా నటిస్తున్న “అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి” చిత్రం కూడా ఇదే తల్లీకొడుకుల సెంటిమెంట్ ప్రధానంగా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ సినిమాలో ఆయన తల్లి పాత్రలో ఒకప్పటి లేడీ సూపర్ స్టార్ విజయశాంతి అదరగొట్టబోతోంది. అద్భుతమైన యాక్షన్ సన్నివేశాలు, హృదయాన్ని హత్తుకునే తల్లీకొడుకుల ఎమోషనల్ సీన్స్ కలగలిసిన ఈ చిత్రాన్ని థియేటర్‌లో చూడటానికి ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. చిలుకూరి ప్రదీప్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా ఈ నెల 18న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.
కళ్యాణ్ రామ్ ఓ బాధ్యతగల కొడుకుగా, విజయశాంతి ఓ ధైర్యవంతమైన తల్లిగా కనిపించ బోతుండటంతో ఈ ఇద్దరి పాత్రలే ప్రధాన ఆకర్షణలుగా నిలుస్తున్నాయి. చిత్రానికి పెట్టిన టైటిల్ కూడా వీరి పాత్రల పేర్లపైనే ఆధారపడింది. 1990లో “కర్తవ్యం” అనే చిత్రంలో వైజయంతి అనే పోలీస్ ఆఫీసర్ పాత్రతో విజయశాంతి జాతీయ స్థాయిలో గుర్తింపు పొందింది. ఇప్పుడు అదే పేరుతో, అదే పాత్రను ఒక తల్లిగా ఈ సినిమాలో మళ్లీ పండించబోతోంది. ఈ సినిమాను చూసిన ఎన్టీఆర్.. “చివరి ఇరవై నిమిషాలు మనసుని తాకుతాయి. ఈ సినిమా కళ్యాణ్ రామ్, విజయశాంతి కెరీర్‌లో ఓ ప్రత్యేకమైన చిత్రం అవుతుంది” అని ప్రశంసలు కురిపించాడు.