ది కంప్లీట్ యాక్టర్
గత నాలుగు దశాబ్దాలుగా 400 కి పైగా సినిమాల్లో నటించి, మలయాళ సినిమాని జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో నిలబెట్టిన ఘనత ఆయనది.;
మలయాళ సినిమా పరిశ్రమలో కొన్ని పేర్లు శాశ్వతంగా నిలిచిపోతాయి. అందులో మోహన్‌లాల్ పేరు ఒకటి. ఈ రోజు ఆయన పుట్టినరోజు. ఈ సందర్భంగా... ఈ లెజెండరీ నటుడి గురించి మాట్లాడకుండా ఉండలేం. మోహన్‌లాల్ విశ్వనాథన్ నాయర్ 1960లో కేరళలోని పత్తినంతిట్ట జిల్లా, ఎలంతూర్‌లో జన్మించారు. ఆయన కేవలం నటుడే కాదు, నిర్మాత, గాయకుడు, రచయిత కూడా. గత నాలుగు దశాబ్దాలుగా 400 కి పైగా సినిమాల్లో నటించి, మలయాళ సినిమాని జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో నిలబెట్టిన ఘనత ఆయనది. ‘మంజిల్ విరింజ పూక్కల్’ సినిమాతో విలన్‌గా కెరీర్ స్టార్ట్ చేసిన మోహన్‌లాల్, తర్వాత హీరోగా, క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా అన్ని రకాల పాత్రల్లో మెస్మరైజ్ చేశారు. ఆయన వర్సటైల్ యాక్టింగ్, సహజమైన డైలాగ్ డెలివరీ మలయాళ సినిమా ఫ్యాన్స్‌కి ఎప్పటికీ గుర్తుండిపోతాయి.
మోహన్‌లాల్ గొప్పతనం ఏంటంటే, ఆయన ఎలాంటి పాత్రలోనైనా ఒదిగిపోయి, ఆ క్యారెక్టర్‌ని జీవించేయడం. ‘కిరీటం, చిత్రం, భరతం, వానప్రస్థం, తాళవట్టం, ‘దృశ్యం’, ‘తుడరుం’ లాంటి సినిమాల్లో ఆయన పెర్ఫార్మెన్స్‌లు ఇందుకు నిదర్శనం. కామెడీ, యాక్షన్, రొమాన్స్, ఎమోషనల్ డ్రామా... ఏ జోనర్‌లోనైనా ఆయన రాణించారు. ఉత్తమ నటుడిగా రెండు జాతీయ అవార్డులు, తొమ్మిది కేరళ రాష్ట్ర అవార్డులతో పాటు, పద్మశ్రీ, పద్మభూషణ్ లాంటి గౌరవాలు ఆయన సంపాదించారు. ఆయన నటనలో ఓ మాయ ఉంది. అది ప్రేక్షకుల్ని సీన్‌లోకి లాగేస్తుంది. మోహన్‌లాల్ సినిమాలు కేవలం ఎంటర్‌టైన్‌మెంట్ కోసమే కాదు, సమాజంలోని సున్నితమైన అంశాలను చర్చించడానికి కూడా వేదికగా నిలిచాయి. ఆయన సినిమాల్లో ఎక్కువగా మనుషుల మధ్య బంధాలు, ఎమోషన్స్, నైతిక విలువలు కనిపిస్తాయి.
ఇవాళ మోహన్‌లాల్ 65వ పుట్టినరోజు జరుపుకుంటున్నారు, కానీ ఆయన ఎనర్జీ, డెడికేషన్ చూస్తే ఆయన ఇంకా యంగే అనిపిస్తుంది. ఇటీవలి కాలంలో ‘లూసిఫర్’, ‘మరక్కర్’, ‘బారోజ్’, ఎంపురాన్ , తుడరుం’ లాంటి సినిమాలతో కూడా తన మార్క్ చూపించారు. నిర్మాతగా, డైరెక్టర్‌గా కూడా ఆయన సినిమా రంగానికి ఎనలేని సేవలు చేస్తున్నారు. ఆయన స్థాపించిన ‘ప్రణవం ఆర్ట్స్’ ద్వారా కొత్త టాలెంట్‌ని ప్రోత్సహిస్తూ, మలయాళ సినిమాని మరింత ఎత్తుకు తీసుకెళ్తున్నారు. మోహన్‌లాల్ కేవలం నటుడిగానే కాదు, ఓ సాంస్కృతిక చిహ్నంగా, మలయాళీల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయారు. ఆయన పుట్టినరోజు సందర్భంగా, ఈ మహానటుడి సినిమా జర్నీని సెలబ్రేట్ చేస్తూ, ఆయనకు మరిన్ని విజయాలు, ఆరోగ్యం కోరుకుందాం.