ఎట్టకేలకు విడుదల కాబోతున్న సురేశ్ గోపీ, అనుపమా సినిమా

మూడు రౌండ్ల విచారణ తర్వాత, మొదట టైటిల్ మార్చడానికి ఇష్టపడని నిర్మాతలు.. జూలై 9 విచారణలో స్వల్ప మార్పుతో ‘జానకి. వి vs స్టేట్ ఆఫ్ కేరళ’ గా టైటిల్‌ను మార్చడానికి అంగీకరించారు.;

By :  K R K
Update: 2025-07-15 01:24 GMT

వారాల తరబడి న్యాయ పోరాటం, అనిశ్చితి తర్వాత, కేంద్ర పర్యాటక శాఖ సహాయ మంత్రి సురేష్ గోపీ నటించిన తాజా చిత్రం ‘జానకి. వి vs స్టేట్ ఆఫ్ కేరళ’ సినిమాకు తాజాగా సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ నుంచి ఆమోదం లభించింది. దీంతో ఈ సినిమా విడుదలకు మార్గం సుగమమైంది.

ఈ చిత్రం మొదట ‘జానకి vs స్టేట్ ఆఫ్ కేరళ’ పేరుతో ఉండగా.. సినిమాటోగ్రాఫ్ చట్టంలోని సెక్షన్ 5బీ(2) నిబంధనలను ఉటంకిస్తూ.. టైటిల్‌లో “జానకి” పేరును ఉపయోగించడంపై సీబీఎఫ్‌సీ అభ్యంతరం వ్యక్తం చేసింది. దీనిపై నిర్మాణ సంస్థ కేరళ హైకోర్టులో సవాల్ చేసింది. ఇది గణనీయమైన జనాదరణను సంపాదించిన న్యాయ పోరాటానికి దారితీసింది.

మూడు రౌండ్ల విచారణ తర్వాత, మొదట టైటిల్ మార్చడానికి ఇష్టపడని నిర్మాతలు.. జూలై 9 విచారణలో స్వల్ప మార్పుతో ‘జానకి. వి vs స్టేట్ ఆఫ్ కేరళ’ గా టైటిల్‌ను మార్చడానికి అంగీకరించారు. మొదట సీబీఎఫ్‌సీ 96 కట్‌లను సూచించగా, బహుళ చర్చల తర్వాత ఇది కేవలం రెండు కట్‌లకు తగ్గించబడింది. అదనంగా, రెండు డైలాగ్‌లు మ్యూట్ చేయబడ్డాయి. సవరించిన వెర్షన్‌ను శనివారం రీసబ్మిట్ చేసిన తర్వాత, సీబీఎఫ్‌సీ వెంటనే సర్టిఫికేట్ జారీ చేసింది.

కేరళ హైకోర్టు గతంలో చివరి వెర్షన్ అందిన మూడు రోజుల్లో సర్టిఫికేట్ జారీ చేయాలని సీబీఎఫ్‌సీని ఆదేశించింది. తదుపరి కోర్టు విచారణ జూలై 16న జరగనుంది. అయితే, ఆలస్యం వల్ల ఇప్పటికే చాలా సమయం వృథా అయిందని, విచారణను ముందుగా జరపాలని నిర్మాణ బృందం ఆసక్తి వ్యక్తం చేసింది. ఈ సినిమా మొదట జూన్ 27న విడుదల కావాల్సి ఉండగా, చివరి ప్రొసీజర్ క్లియరెన్స్‌లు పూర్తయితే జూలై 18న థియేటర్లలో విడుదల కానుంది.

Tags:    

Similar News