రాజ్ కపూర్ 100వ జయంతి వేడుకలు .. ప్రధానమంత్రికి ప్రత్యేక బహుమతి
బాలీవుడ్ లెజెండరీ నటుడు రాజ్ కపూర్ 100వ జయంతి సందర్భంగా, కపూర్ కుటుంబం భారత ప్రధాని నరేంద్ర మోదీని కలుసుకుని ఈ మహోత్సవానికి ఆహ్వానించింది. రీమా జైన్, నీతూ కపూర్, కరిష్మా కపూర్, కరీనా కపూర్ ఖాన్, రణబీర్ కపూర్, అర్మాన్ జైన్ సహా కుటుంబ సభ్యులు ప్రధాన మంత్రి మోదీకి ప్రత్యేకమైన బహుమతిని అందించారు. ఈ బహుమతి రాజ్ కపూర్ 1960లో నటించిన క్లాసిక్ సినిమా ‘జిస్ దేశ్ మే గంగా బెహతీ హై’ లో ఆయన ఉపయోగించిన ప్రసిద్ధ లాంతరు.
ఈ లాంతర్ ను కపూర్ కుటుంబం దశాబ్దాలుగా పరిరక్షించుకుంటూ వస్తోంది. కానీ ఇప్పుడు.. రాజ్ కపూర్ అభిమానులు ఈ చారిత్రక వస్తువును దగ్గరగా చూసే అవకాశం కల్పించేందుకు, దీన్ని ఎగ్జిబిషన్ లో ప్రదర్శించడానికి, ప్రధానమంత్రి సంగ్రహాలయంకు బహుమతిగా ఇచ్చారు. మార్చి 1న ప్రత్యేక ప్రదర్శనలో దీన్ని ప్రదర్శించనున్నారు. భారత సినీ చరిత్రను మరింత లోతుగా తెలుసుకోవాలనుకునే వారికి ఇది ప్రధాన ఆకర్షణగా మారనుంది.
కపూర్ కుటుంబ సభ్యులు ప్రధాని మోదీతో మాట్లాడుతుండగా.. రాజ్ కపూర్ మరియు వారి కుటుంబానికి చెందిన ఇతర గొప్ప సినీ ప్రముఖుల గురించి వివరించారు. ఈ సందర్భంగా రాజ్ కపూర్ కుమార్తె రీమా జైన్, ఆయన నటించిన శ్రీ 420 చిత్రం నుంచి ఓ ప్రసిద్ధ గీతాన్ని ఉటంకించారు. ‘మే నా రహుంగీ, తుం నా రహోగే.. లేకిన్ రహేగీ నిశానియా...’ ‘నేను ఉండకపోవచ్చు, నీవు ఉండకపోవచ్చు.. కానీ గుర్తుగా మన జ్ఞాపకాలు ఉంటాయి’ అని దీని అర్ధం.
ఈ జయంతి వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. కపూర్ కుటుంబ సభ్యులతో పాటు, బాలీవుడ్ ప్రముఖులు ఈ వేడుకలో పాల్గొన్నారు. రాణీ ముఖర్జీ, కార్తిక్ ఆర్యన్, శర్వరీ, ఫర్హాన్ అక్తర్, బోనీ కపూర్, రితేష్ దేశ్‌ముఖ్, జెనీలియా డిసౌజా మరియు మరెందరో ప్రముఖులు ఈ వేడుకను శోభాయమానం చేశారు. కుటుంబ సభ్యులు సంతోషంగా ఫొటోలు దిగుతూ.. ఈ ఆనందాన్ని అభిమానులతో పంచుకున్నారు. రాజ్ కపూర్ జీవితం, ఆయన సినిమాల స్ఫూర్తి, బాలీవుడ్‌లో వారి కుటుంబం అందించిన విశిష్టమైన సేవలను గుర్తుచేసుకుంటూ, ఈ 100వ జయంతి వేడుకలు ఒక చారిత్రక ఘట్టంగా నిలిచాయి.