పవన్ రియల్ హీరో – ప్రియాంక

టాలీవుడ్ లో పవన్ కళ్యాణ్ 'ఓజీ' మేనియా మొదలైంది. సుజీత్‌ దర్శకత్వంలో, డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్స్ నిర్మించిన ఈ భారీ పీరియాడికల్‌ గ్యాంగ్‌స్టర్‌ డ్రామా ఈ నెల 25న ప్రేక్షకుల ముందుకు రానుంది.;

By :  S D R
Update: 2025-09-17 01:15 GMT

టాలీవుడ్ లో పవన్ కళ్యాణ్ 'ఓజీ' మేనియా మొదలైంది. సుజీత్‌ దర్శకత్వంలో, డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్స్ నిర్మించిన ఈ భారీ పీరియాడికల్‌ గ్యాంగ్‌స్టర్‌ డ్రామా ఈ నెల 25న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాలో కణ్మణి పాత్రలో ప్రియాంక అరుళ్‌ మోహన్ నటించింది. లేటెస్ట్ గా ఈ మూవీలోని తన పాత్ర గురించి.. సినిమా విశేషాల గురించి మీడియాతో ముచ్చటించింది ప్రియాంక.

ఈ సినిమాలో తాను పోషించిన కణ్మణి పాత్ర గురించి మాట్లాడుతూ.. “ఇది 1980–1990ల కాలంలో జరిగే కథ. పవన్‌ గారు పోషించిన ‘గంభీర’ జీవితానికి మలుపు తిప్పే పాత్రే కణ్మణి. ఇప్పటి వరకు నేను చేసిన రోల్స్‌లో ఈ క్యారెక్టర్‌ ఎప్పటికీ ప్రత్యేకం. పవన్‌ గారితో రెండున్నరేళ్ల ప్రయాణం నిజంగా అదృష్టంగా భావిస్తున్నా” అని తెలిపింది.

సినిమా షూటింగ్‌ అనుభవాలను గుర్తుచేసుకుంటూ ప్రియాంక, “పవన్‌ సార్‌ ఎంతటి క్రేజ్‌ ఉన్నా కూడా చాలా సింపుల్‌గా ఉంటారు. సెట్‌లో పుస్తకాల గురించే ఎక్కువగా మాట్లాడుతారు. అప్పుడప్పుడు రాజకీయాలు, సినిమాలపై చర్చిస్తారు. ఆయన నుంచి నేర్చుకోవడానికి ఎన్నో విషయాలు ఉన్నాయి. తెరపై, తెర వెనుకా ఆయన నిజమైన హీరో” అని తెలిపింది.

ఈ సినిమాలో తమన్‌ స్వరపరిచిన ‘సువ్వి సువ్వి’ పాట ఫస్ట్‌ కంపోజ్‌ చేసిన ట్రాక్‌ అని, దానిపైనే ప్రత్యేకమైన అనుబంధం ఉందని ప్రియాంక పేర్కొంది. “రెండేళ్ల నుంచి ఈ పాట రిలీజ్‌ కోసం ఎదురుచూశా. విడుదలైన తర్వాత అందరికీ నచ్చడం చాలా ఆనందం ఇచ్చింది. బీజీఎం వేరే లెవెల్‌లో ఉంది” అని చెప్పింది.

ప్రియాంక మాట్లాడుతూ, “ఈ సినిమా యాక్షన్‌తో పాటు బలమైన ఫ్యామిలీ డ్రామాను కలిపి తెరకెక్కించారని.. సుజీత్‌ డైరెక్షన్‌లో ప్రతి పాత్రకు స్పష్టత ఉంటుంది. నా లుక్‌, క్యారెక్టర్‌ బాగుండటానికి కారణం ఆయనే. బాక్సాఫీస్‌ నంబర్స్‌ కంటే సినిమాలో క్వాలిటీ, సోల్‌ ముఖ్యమని నేను నమ్ముతాను” అని చెప్పింది.

పవర్‌ఫుల్‌ గ్యాంగ్‌స్టర్‌ డ్రామాగా రాబోతున్న ‘ఓజీ’లో యాక్షన్‌తో పాటు భావోద్వేగాలకు కూడా పెద్ద పీట వేశారు. పవన్‌ కల్యాణ్‌ – ప్రియాంక మోహన్ జంట తెరపై ఎలా మెప్పిస్తారో చూడాలనే ఆసక్తి ఫ్యాన్స్‌తో పాటు సినీప్రియుల్లో ఉత్కంఠ రేపుతోంది. సెప్టెంబర్‌ 25న ఈ మిస్టరీకి తెరలేవనుంది.

Tags:    

Similar News