నటుడు ముకుల్ దేవ్ కన్నుమూత
ప్రముఖ బాలీవుడ్ నటుడు, మాజీ మోడల్ ముకుల్ దేవ్ (54) అనారోగ్యంతో కన్నుమూశారు. శుక్రవారం (మే 23) రాత్రి ఢిల్లీలోని ఓ ఆసుపత్రిలో ఆయన తుదిశ్వాస విడిచారు.;
ప్రముఖ బాలీవుడ్ నటుడు, మాజీ మోడల్ ముకుల్ దేవ్ (54) అనారోగ్యంతో కన్నుమూశారు. శుక్రవారం (మే 23) రాత్రి ఢిల్లీలోని ఓ ఆసుపత్రిలో ఆయన తుదిశ్వాస విడిచారు. గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతూ ఆసుపత్రిలోని ఐసీయూలో చికిత్స పొందిన ఆయన, చివరకు కోలుకోలేకపోయారు.
ఆయన సోదరుడు, ప్రముఖ నటుడు రాహుల్ దేవ్‌తో పాటు, సినీ ప్రముఖులు, సన్నిహితులు, అభిమానులు ఈ వార్తతో షాక్‌కు గురయ్యారు. ముకుల్ దేవ్ తల్లిదండ్రుల మరణం తర్వాత ఒంటరిగా గడిపారని, ఎక్కువగా ఇంటి నుండి బయటకు రాకుండా, ఎవరినీ కలవకుండా ఉండేవారని ఆయన సన్నిహితులు వెల్లడించారు.
ముకుల్ దేవ్ ఢిల్లీలోని ఓ పంజాబీ కుటుంబంలో జన్మించారు. ఆయన తండ్రి హరి దేవ్ మాజీ పోలీస్ కమిషనర్‌గా పనిచేశారు. ముకుల్ నటనలోకి రాకముందు విమానయాన రంగంలో పనిచేశారు. అయితే, సినిమా పట్ల మక్కువతో 1996లో టెలివిజన్ సీరియల్ ‘ముమ్‌కిన్‘ ద్వారా తన నటనా ప్రస్థానాన్ని ప్రారంభించారు. అదే ఏడాది సుస్మితా సేన్‌తో కలిసి ‘దస్తక్‘ చిత్రం ద్వారా సినీ రంగంలోకి అడుగుపెట్టారు.
ముకుల్ దేవ్ బహుముఖ నటుడిగా పేరుగాంచారు. హిందీ, పంజాబీ, తెలుగు, తమిళం, కన్నడ, బెంగాలీ, మలయాళం వంటి బహుభాషా చిత్రాల్లో నటించి ప్రేక్షకుల మనసులు గెలుచుకున్నారు. హిందీలో ‘యమ్‌లా పగ్లా దీవానా, సన్ ఆఫ్ సర్దార్, ఆర్... రాజ్‌కుమార్, జై హో‘ వంటి చిత్రాల్లో ఆయన పాత్రలకు మంచి పేరొచ్చింది. ఇక తెలుగులో ‘కృష్ణ, ఏక్ నిరంజన్, కేడీ, అదుర్స్‘ వంటి చిత్రాల్లో విలన్‌గా, కీలక పాత్రల్లో నటించి మెప్పించారు.