'గాంధీ తాత చెట్టు' రివ్యూ

క్రియేటివ్ జీనియస్ సుకుమార్ కూతురు సుకృతి వేణి ప్రధాన పాత్రలో నటించిన చిత్రం 'గాంధీ తాత చెట్టు'. పద్మావతి మల్లాది దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఈరోజు (జనవరి 24న) ప్రేక్షకుల ముందుకు వస్తోంది.;

By :  S D R
Update: 2025-01-24 01:22 GMT

నటీనటులు: సుకృతి వేణి, ఆనంద్‌ చక్రపాణి, రఘురామ్‌, భాను ప్రకాష్‌, నేహాల్‌ ఆనంద్‌ కుంకుమ, రాగ్‌ మయూర్‌ తదితరులు

సినిమాటోగ్రఫీ: శ్రీజిత్‌ చెర్వుపల్లి, విశ్వ దేవబత్తుల

సంగీతం: రీ

ఎడిటింగ్‌: హరి శంకర్ టి.ఎన్.

నిర్మాతలు: నవీన్‌ ఎర్నేని, యలమంచిలి రవిశంకర్‌, శేష సింధురావు

దర్శకత్వం: పద్మావతి మల్లాది

విడుదల తేది: 24-01-2025


క్రియేటివ్ జీనియస్ సుకుమార్ కూతురు సుకృతి వేణి ప్రధాన పాత్రలో నటించిన చిత్రం 'గాంధీ తాత చెట్టు'. పద్మావతి మల్లాది దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఈరోజు (జనవరి 24న) ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఈ సినిమా ఇప్పటికే పలు అంతర్జాతీయ ఫిల్మ్ ఫెస్టివల్స్‌లో ప్రదర్శించి అవార్డులు గెలుచుకుంది, అందులో ఉత్తమ బాల నటిగా సుకృతి వేణి కూడా పురస్కారం అందుకుంది. ఈ సినిమాపై ఉన్న నమ్మకంతో మేకర్స్ ఈ సినిమా ప్రివ్యూ ఒక రోజు ముందుగానే మీడియాకు ప్రదర్శించారు. మరి.. 'గాంధీ తాత చెట్టు' ఎలా ఉందో? ఈ రివ్యూలో చూద్దాం.


కథ

తెలంగాణలోని బండ్లూరు గ్రామానికి చెందిన రామచంద్రయ్య (ఆనంద చక్రపాణి) గాంధీజీపై గాఢమైన అభిమానం కలిగిన వ్యక్తి. గాంధీ మరణానంతరం, ఆయన స్మృతిగా తన తండ్రితో కలిసి నాటిన చెట్టు ప్రస్తుతం ఊరికి నీడనిస్తోంది, రామచంద్రయ్యకు అది ఎంతో ప్రియమైనది. గాంధీపై తన ప్రేమకు గుర్తుగా మనవరాలికి 'గాంధీ' అనే పేరు పెట్టిన రామచంద్రయ్య, ఆమెను నిజాయితీ, మంచితనం విలువలతో పెంచుతాడు.

తాతతో బలమైన బంధం ఉన్న గాంధీ (సుకృతి వేణి) ఎల్లప్పుడూ తాత నేర్పిన విలువలకు కట్టుబడి ఉంటూ జీవనం సాగిస్తుంది. అయితే, అనుకోని పరిణామం గాంధీ జీవితంలో అలజడి సృష్టిస్తుంది. ఈ సంఘటన ఆమె జీవితం, గ్రామ భవిష్యత్తును ఎలా మార్చింది? అనంతరం గాంధీ తీసుకున్న నిర్ణయాలు ఏమిటి? అనేది మిగతా కథ.


విశ్లేషణ

‘గాంధీ తాత చెట్టు’ సినిమా గ్రామీణ నేపథ్యాన్ని హృద్యంగా ఆవిష్కరించిన చిత్రం. తాత పాత్రలో రామచంద్రయ్య (ఆనంద చక్రపాణి), తన తాతగారి ఆచారాలను గౌరవించే మనవరాలుగా గాంధీ (సుకృతి వేణి) కలసి ఒక చెట్టును కాపాడటానికి చేసిన పోరాటం ప్రధాన కథాంశం. ఈ చిత్రం రైతులు, పెట్టుబడి దారుల మధ్య సంఘర్షణను సున్నితంగా చూపిస్తుంది.

రియలిస్టిక్ నేరేషన్, మనసుకు హత్తుకునే పాత్రలు ప్రధాన ఆకర్షణ. రామచంద్రయ్య పాత్రలో ఉన్న సహజత్వం, చెట్టు పాత్రకు తనికెళ్ల భరణి గాత్రదానం ప్రత్యేకంగా నిలుస్తాయి. గాంధీ పాత్రలో సుకృతి చూపించిన నిజాయితీ ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది.

తాత నుంచి నేర్చుకున్న విలువలతో గాంధీ ఊరి సమస్యను పరిష్కరించే తీరును దర్శకురాలు పద్మావతి సున్నితంగా తెరకెక్కించారు. నెమ్మదిగా సాగిన కథనంతో పాటుగా, కొన్ని అన్ రియలిస్టిక్ సన్నివేశాలు మైనస్‌లుగా అనిపించినా, మొత్తం మీద ఇది ఒక హృద్యమైన చిత్రంగా చెప్పొచ్చు. 'గాంధీ తాత చెట్టు' వంటి చిత్రాలు అందరూ చూడదగ్గవి.


నటీనటులు, సాంకేతిక నిపుణులు

‘గాంధీ తాత చెట్టు’లో నటీనటుల ప్రతిభ ప్రధాన ఆకర్షణగా నిలిచింది. గాంధీ పాత్ర కోసం సుకృతి గుండు చేయించుకోవడంతో పాటు, అమాయకత్వం ఉట్టిపడేలా నటించి ప్రేక్షకుల మన్ననలు పొందింది. ఆమె నటన చూసి ఇది ఒక పాత్రే అనే భావన కలగకుండా, నిజంగా గాంధీ అనే అమ్మాయి ఉందని అనిపిస్తుంది.

రామచంద్రయ్యగా ఆనంద చక్రపాణి ప్రతి సన్నివేశంలో తన ప్రతిభను ప్రదర్శించాడు. ఈ టాలెంటెడ్ నటుడిని టాలీవుడ్ మరింతగా ఉపయోగించుకోవాలి. సుకృతి తల్లిదండ్రులుగా నటించిన ఆర్టిస్టులు, మాస్టారిగా నటించిన పెద్దాయన, కథానాయిక స్నేహితులుగా నటించిన యువ నటులు అందరూ తమ పాత్రలకు న్యాయం చేశారు.

ఫ్యాక్టరీ ప్రతినిధిగా రాగ్ మయూర్ అద్భుతంగా ఆకట్టుకోగా, చెట్టు పాత్రకు తనికెళ్ల భరణి తన గొంతుతో ప్రాణం పోశాడు. మొత్తం నటీనటుల కృషి సినిమాకు మణికట్టుగా నిలిచింది.

'గాంధీ తాత చెట్టు' సినిమా టెక్నికల్ అంశాలు బాగానే పండాయి. ఈ చిత్రాన్ని ఒక చిన్న ఊరిలో తక్కువ ఖర్చుతో తీసిన బృందం అభినందనీయమైనది. పద్మావతి మల్లాది, రచయిత, దర్శకురాలిగా తన ప్రతిభను చాటుకున్నారు. రీ సంగీతం, విశ్వ దేవబత్తుల-శ్రీజిత చెరువుపల్లి ఛాయాగ్రహణం ఈ సినిమాకి ప్రధాన ఆకర్షణ. ఈరోజుల్లో ఇలాంటి ప్రత్యేక కథను తెరపైకి తీసుకురావడంపై ఆమె అభిరుచిని ప్రశంసించాల్సిందే. మంచి కథను అర్థవంతమైన పాత్రలు, చక్కటి సంభాషణలతో, హృద్యమైన రూపంలో అందించిన తీరు మరింత ఆకట్టుకుంది.


చివరగా

పిల్లలతో చూడదగిన సినిమా 'గాంధీ తాత చెట్టు'

Tags:    

Similar News