'జూనియర్' మూవీ రివ్యూ
ప్రముఖ రాజకీయ నాయకుడు గాలి జనార్దన రెడ్డి తనయుడు కిరీటి రెడ్డి హీరోగా పరిచయమైన చిత్రం 'జూనియర్'. ఈ సినిమాలో శ్రీలీల హీరోయిన్‌గా నటించగా, జెనీలియా మరో కీలక పాత్రలో నటించింది.;
నటీనటులు: కిరీటి, శ్రీలీల, జెనీలియా, రవిచంద్రన్, రావు రమేష్, సత్య, వైవా హర్ష, అచ్యుత్ కుమార్ తదితరులు
సినిమాటోగ్రఫీ: కేకే సెంథిల్ కుమార్
సంగీతం: దేవి శ్రీ ప్రసాద్
ఎడిటింగ్ : నిరంజన్ దేవరమానె
నిర్మాత: రజనీ కొర్రపాటి
దర్శకత్వం: రాధా కృష్ణ రెడ్డి
విడుదల తేది: జూలై 18, 2025
ప్రముఖ రాజకీయ నాయకుడు గాలి జనార్దన రెడ్డి తనయుడు కిరీటి రెడ్డి హీరోగా పరిచయమైన చిత్రం 'జూనియర్'. ఈ సినిమాలో శ్రీలీల హీరోయిన్‌గా నటించగా, జెనీలియా మరో కీలక పాత్రలో నటించింది. వారాహి చలన చిత్రం బ్యానర్ పై రజనీ కొర్రపాటి నిర్మాణంలో రాధాకృష్ణ ఈ సినిమాని తెరకెక్కించారు. ఈ చిత్రానికి టాప్ టెక్నీషియన్స్ దేవిశ్రీప్రసాద్, సెంథిల్ కుమార్ పనిచేశారు. ప్రపంచవ్యాప్తంగా వెయ్యికి పైగా థియేటర్లలో ఈరోజు ఆడియన్స్ ముందుకొచ్చిన ‘జూనియర్‘ మూవీ ఎలా ఉందో? ఈ రివ్యూలో చూద్దాం.
కథ
విజయనగరానికి చెందిన కోదండపాణి (రవి చంద్రన్)–శ్యామల దంపతులకు ఆలస్యంగా జన్మించిన కుమారుడు అభి (కిరీటీ రెడ్డి). తల్లిని కోల్పోయిన వెంటనే పుట్టిన అభిని కోదండపాణి ఎంతో ప్రేమతో పెంచుతాడు. అయితే తండ్రి చూపించే మితిమీరిన ప్రేమ, వయస్సు గ్యాప్ అభికి అసహనంగా మారుతుంది. పై చదువుల కోసం నగరానికి వెళ్లి స్వతంత్రంగా జీవించాలనుకుంటాడు.
తన కాలేజ్ రోజుల్ని స్నేహితులతో సరదాగా గడిపిన అభి, చిన్నప్పటినుంచి కోల్పోయిన జ్ఞాపకాలను తిరిగి సృష్టించుకుంటూ ముందుకెళ్తాడు. తాను మనసు పడిన స్ఫూర్తి (శ్రీలీల) పనిచేసే కంపెనీలో ఉద్యోగం కూడా సంపాదిస్తాడు. కానీ అక్కడ ఆఫీస్ బాస్ విజయ సౌజన్య (జెనీలియా)కి అభి అంటే అస్సలు ఇష్టం ఉండదు. ఆమెకు తన పేరుతో ఉన్న విజయనగరం పట్టణం కూడా ఇష్టం ఉండదు. అయినా పరిస్థితుల వల్ల అదే ఊరికి, అదే అభితో కలిసి ప్రయాణించాల్సి వస్తుంది. అక్కడ ఏమైంది? విజయ సౌజన్యకి ఆ ఊరితో సంబంధం ఏంటి? అసలు అభికి, విజయ సౌజన్యకి ఉన్న సంబంధం ఏంటి? అనేది వెండితెరపై చూడాల్సిందే.
విశ్లేషణ
ప్రముఖ కుటుంబాల వారసులు సినిమా రంగంలోకి అడుగుపెడితే, వారి తొలి సినిమాపైనే భారీ అంచనాలు ఏర్పడతాయి. అలాంటి అంచనాల మధ్య కిరీటి రెడ్డి హీరోగా పరిచయమైన చిత్రం ‘జూనియర్’. తొలి సినిమా అనగానే హీరో స్టామినాను చూపించేలా రూపొందించే టెంప్లేట్ సినిమాల కోవలోనే 'జూనియర్' కూడా వస్తుంది. హీరో కిరీటి పరిచయం నుంచి ఇంట్రడక్షన్ ఫైట్, డాన్స్, కామెడీ వరకు ఫస్టాఫ్ మొత్తం అతని టాలెంట్ షోకేస్ చేసేలా సాగుతుంది. దర్శకుడు రాధా కృష్ణ ఈ సినిమాను హీరోని ఎలివేట్ చేసే అన్ని అంశాలతో పక్కాగా ప్లాన్ చేశాడు.
కానీ కథ విషయానికి వచ్చేసరికి కొత్తదనం లేకపోవడం మైనస్‌గా మారింది. ప్రతి సీన్ ఎక్కడో చూసినట్టే అనిపిస్తుంది. కామెడీ, పాటలు, యాక్షన్ సన్నివేశాలు బాగున్నా, కథనంలో పాత రుచులు కనిపించాయి. ఫస్టాఫ్ కాలేజీ బ్యాక్‌డ్రాప్‌లో సాగితే, సెకండాఫ్ పూర్తిగా గ్రామీణ నేపథ్యంలో సాగుతుంది. శ్రీమంతుడు, మహర్షి చిత్రాల ప్రభావం బాగా కనిపిస్తుంది.
అయినా కొన్ని ఎమోషనల్ సీన్లు, క్లైమాక్స్‌లోని చిన్న ట్విస్ట్ బాగున్నాయి. కథ బలంగా ఉండి ఉంటే ఫలితం ఇంకా బెటర్‌గా ఉండేది. అయినప్పటికీ కిరీటిరెడ్డికి ఇది ఫర్ఫెక్ట్ లాంచింగ్ ప్యాడ్ అని చెప్పొచ్చు.
నటీనటులు, సాంకేతిక నిపుణులు
తొలి సినిమా అయినా కిరీటీ ఎన్నో సినిమాల అనుభవం ఉన్నవాడిలా కనిపించాడు. డైలాగ్ డెలివరీ, ఎమోషన్ సీన్లలోనూ ఆకట్టుకున్నాడు. ముఖ్యంగా యాక్షన్, డాన్సుల్లో అదరగొట్టాడు. శ్రీలీలతో కలిసి చేసిన ‘వైరల్ వయ్యారి‘ పాటలో ఎన్టీఆర్, బన్నీ స్థాయిలో స్టెప్పులు వేశాడు.
శ్రీలీల పాత్ర చిత్రణ పాటలకే పరిమితమైంది. సెకండాఫ్‌లో ఒకే పాటలో కనిపిస్తుంది. జెనీలియా విజయ సౌజన్యగా బాగుంది. కానీ నటనకు అంతగా అవకాశం దక్కలేదు. రవిచంద్రన్ తండ్రి పాత్రలో మెప్పించాడు. కామెడీ విభాగంలో వైవా హర్ష, సత్యలు నవ్వులు పూయించారు. రావు రమేష్, అచ్యుత్ కుమార్ వంటి నటులు తమ పాత్రలకు న్యాయం చేశారు.
సాంకేతికంగా దేవిశ్రీ ప్రసాద్ సంగీతం ఈ చిత్రానికి ప్రధాన ఆకర్షణగా నిలిచింది. బ్యాక్‌గ్రౌండ్ స్కోర్‌తో సినిమాకి ప్రత్యేకమైన ఉత్సాహం తీసుకువచ్చాడు. 'వైరల్ వయ్యారి' పాట బిగ్ స్క్రీన్‌పై మరింతగా బాగుంది. సినిమాటోగ్రఫీ విభాగంలో సెంథిల్ కుమార్ ప్రతి ఫ్రేమ్‌ను ఎంతో రిచ్‌గా చూపించాడు. నిర్మాణ విలువలు బాగున్నాయి.
చివరగా
‘జూనియర్‘.. కిరీటి రెడ్డి షో రీల్