'కింగ్డమ్' మూవీ రివ్యూ
రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ లేటెస్ట్ మూవీ 'కింగ్డమ్'. భారీ పీరియాడిక్ యాక్షన్ ఎంటర్‌టైనర్ గా గౌతమ్ తిన్ననూరి ఈ చిత్రాన్ని తెరకెక్కించాడు. ప్రతిష్ఠాత్మక సితార ఎంటర్ టైన్ మెంట్స్ నిర్మాణంలో రూపొందిన 'కింగ్డమ్' ఈరోజు ఆడియన్స్ ముందుకు వచ్చింది.;
నటీనటులు: విజయ్ దేవరకొండ, భాగ్యశ్రీ బోర్సే, సత్య దేవ్ తదితరులు
సినిమాటోగ్రఫీ: జోమోన్ టి జాన్, గిరీష్ గంగాధరన్
సంగీతం: అనిరుధ్
ఎడిటింగ్ : నవీన్ నూలి
నిర్మాతలు: నాగ వంశీ – సాయి సౌజన్య
దర్శకత్వం: గౌతమ్ తిన్ననూరి
విడుదల తేది: జూలై 31, 2025
రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ లేటెస్ట్ మూవీ 'కింగ్డమ్'. భారీ పీరియాడిక్ యాక్షన్ ఎంటర్‌టైనర్ గా గౌతమ్ తిన్ననూరి ఈ చిత్రాన్ని తెరకెక్కించాడు. ప్రతిష్ఠాత్మక సితార ఎంటర్ టైన్ మెంట్స్ నిర్మాణంలో రూపొందిన 'కింగ్డమ్' ఈరోజు ఆడియన్స్ ముందుకు వచ్చింది. మరి.. 'కింగ్డమ్' ఎలా ఉందో? ఈ రివ్యూలో చూద్దాం.
కథ
హైదరాబాద్‌లో కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న సూరి (విజయ్ దేవరకొండ) తన చిన్నతనంలోనే తండ్రిని హత్య చేసి పరారైన అన్న శివ (సత్యదేవ్) కోసం వెతుకుతూ ఉంటాడు. అందుకోసం హైదరాబాదు నుంచి శ్రీలంక వరకు ప్రయాణిస్తాడు. అక్కడ మనుషులను రాక్షసులుగా మార్చే స్మగ్లింగ్ ప్రపంచంలోకి అడుగుపెట్టి, అక్కడి రాక్షసుల్ని అధిగమించి సూరి ఎలా రాజయ్యాడు? అనేది కథ.
విశ్లేషణ
‘కింగ్డమ్’ కథ రెండు లేయర్లుగా నడుస్తుంది. మొదటిది – 1920లో శ్రీకాకుళంలో బ్రిటిష్ దాడుల తర్వాత శ్రీలంకకు పారిపోయిన ట్రైబల్ తెగ, తమ నాయకుడి కోసం దశాబ్దాలుగా ఎదురుచూస్తూ ఉండటం. రెండవది – చిన్నప్పుడే ఇంటి నుంచి పారిపోయిన అన్న కోసం తమ్ముడు చేసే వెతుకులాట. ఈ రెండు వేర్వేరు కథలుగా కనిపించినా, దర్శకుడు గౌతమ్ తిన్ననూరి వాటిని బలమైన ఎమోషనల్ కనెక్షన్‌తో కలిపి ఒక యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా మలిచాడు.
ఓ ఉన్నతాధికారి కానిస్టేబుల్ సూరిని స్పైగా మార్చి శ్రీలంకకి పంపిస్తాడు. అక్కడే కథ మళ్లీ మొదలవుతుంది. నాయకుడి కోసం ఎదురుచూసే తెగ కథలోకి సూరి ఎలా జొరగతాడనేది ఆసక్తికరంగా మారుతుంది. అంతలో తన అన్న శివను గుర్తు చేసుకుంటూ సాగే ఫ్లాష్‌బ్యాక్ ఎపిసోడ్‌తో సూరి జర్నీకి ఎమోషనల్ డెప్త్ బాగుంది.
ఫస్ట్ హాఫ్ ప్రేక్షకులను బాగా ఎంగేజ్ చేస్తుంది. ఇంట్రడక్షన్ సీన్స్, డ్రామా, ఎమోషన్స్ ఆకట్టుకుంటాయి. అయితే సెకండ్ హాఫ్ లో కొన్ని చోట్ల ఇంకొన్ని సినిమాల ప్రభావం కనిపిస్తుంది.
నటీనటులు, సాంకేతిక నిపుణులు
విజయ్ దేవరకొండ సూరిగా తన కెరీర్‌లోనే బెస్ట్ పెర్ఫామెన్స్ ఇచ్చాడు. ఒక సాధారణ కానిస్టేబుల్‌గా కనిపించిన సూరి, జైలులో తన అన్న శివను కలిసిన తర్వాత స్పై ఆపరేషన్‌లో కీలక పాత్ర పోషించి చివరికి కింగ్డమ్‌కి రాజుగా ఎదుగుతాడు. ఈ క్యారెక్టర్‌లో ఆయన చూపిన ఎమోషన్స్, ట్రాన్సిషన్స్ ప్రేక్షకులను కట్టిపడేస్తాయి.
అన్న శివగా సత్యదేవ్ నటన అసాధారణం. విజయ్ లీడ్ అయితే, సత్యదేవ్ సెకండ్ హీరో కాదు.. సహజంగా మరో హీరోనే. భాగ్యశ్రీ బోర్సే కథలో విలీనం అయిన మధు పాత్రలో ఆకట్టుకుంది. ఆమె పాత్రకీ స్పష్టమైన ప్రయోజనం ఉంది. విలన్ మురుగన్‌గా వెంకటేష్ వీపీ తన భిన్నమైన శైలి నటనతో శభాష్ అనిపించాడు.
టెక్నికల్‌గా సినిమా ఎక్కడా తగ్గలేదు. రియల్ లొకేషన్స్‌లో షూటింగ్ చేయడం ద్వారా ఒరిజినాలిటీని క్యాప్చర్ చేశాడు గౌతమ్ తిన్ననూరి. కోలీవుడ్ రాక్ స్టార్ అనిరుధ్ తనదైన బి.జి.ఎమ్. తో సన్నివేశాలను బాగా ఎలివేట్ చేశాడు. గిరీష్ గంగాధరన్, జోమన్ టి జాన్ సినిమాటోగ్రఫీ బాగుంది. శ్రీలంకను స్క్రీన్ మీద అద్భుతంగా ఆవిష్కరించారు. యాక్షన్ సీక్వెన్స్ బాగా డిజైన్ చేశారు. సితార సంస్థ నిర్మాణ విలువలు బాగున్నాయి.
చివరగా
కొత్త ప్రపంచాన్ని ఆవిష్కరించే 'కింగ్డమ్'
Telugu 70MM Rating: 3.25 / 5