'ఓ భామ అయ్యో రామ' మూవీ రివ్యూ

యంగ్ హీరో సుహాస్ నటించిన చిత్రం 'ఓ భామ అయ్యో రామ'. ఈ చిత్రంలో మాళవిక మనోజ్ హీరోయిన్ గా నటించింది.;

By :  S D R
Update: 2025-07-11 12:18 GMT

నటీనటులు: సుహాస్‌, మాళవిక మనోజ్‌, అనిత హస్నా నందిని, అలీ, రవీందర్‌ విజయ్‌, ప్రభాస్‌ శ్రీను, రఘు, పృథ్వీరాజ్‌ తదితరులు

ఎడింటింగ్ : భవిన్‌ ఎం షా

సినిమాటోగ్రఫీ: ఎస్‌ మణికందన్‌

సంగీతం: రథన్‌

నిర్మాత: హర్ష నల్ల

దర్శకత్వం: రామ్‌ గోదల

విడుదల తేది: జూలై 11, 2025

యంగ్ హీరో సుహాస్ నటించిన చిత్రం 'ఓ భామ అయ్యో రామ'. ఈ చిత్రంలో మాళవిక మనోజ్ హీరోయిన్ గా నటించింది. రామ్ గోదాల దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని హరీష్‌ నల్ల నిర్మించారు. ఇప్పటికే విడుదలైన ప్రచార చిత్రాలతో ‘ఓ భామ అయ్యో రామ‘పై మంచి అంచనాలు ఏర్పడ్డాయి. మరి.. ఈరోజు ఆడియన్స్ ముందుకొచ్చిన ఈ సినిమా ఎలా ఉందో? ఈ రివ్యూలో చూద్దాం.

కథ

రామ్‌ (సుహాస్‌) తల్లి (అనిత) ఓ క్లాసికల్ డ్యాన్సర్. భర్త చేసిన మోసాన్ని తట్టుకోలేక, కొడుకుని తీసుకుని ఇంటిని విడిచిపెడుతుంది. కొన్నాళ్లకే ఆమె కూడా చనిపోవడంతో, రామ్‌ని అతని మేనమామ (అలీ) పెంచుతాడు.

ఒక రోజు అనుకోకుండా రామ్‌కు సత్యభామ (మాళవిక మనోజ్‌) తారసపడుతుంది. ఆమె ప్రముఖ వ్యాపారవేత్త కూతురు. రామ్‌ మంచితనానికి ఫిదా అయిన ఆమె అతనిని సినిమా డైరెక్టర్‌ చేయాలనుకుంటుంది.

రామ్‌కి సినిమాలంటే అసహ్యం ఉన్నా, అతనిలో ఉన్న టాలెంట్‌ చూడగలిగిన సత్యభామ, అతనిని దర్శకుడు హరీష్ శంకర్‌ దగ్గర సహాయ దర్శకుడిగా చేరుస్తుంది. తర్వాత రామ్‌ జీవితం ఎలా మారింది? సత్యభామ ఎందుకు దూరమైంది? అన్నది తెరపై చూడాల్సిందే.

విశ్లేషణ

సుహాస్‌ నటన, కథల ఎంపికపై ప్రేక్షకుల్లో మంచి నమ్మకం ఉంది. అయితే, ఈసారి ఆ నమ్మకాన్ని ‘ఓ భామ అయ్యో రామ’ పూర్తిగా నిలబెట్టుకోలేకపోయింది. ట్రైలర్‌లో బలమైన కథ ఉంటుందన్న నమ్మకం కలిగించినా, తెరపై మాత్రం సినిమా నిరాశ పరచింది.

సినిమా ప్రారంభంలో రామ్‌ జీవితాన్ని పరిచయం చేసిన దర్శకుడు, సత్యభామ ఎంట్రీతో అసలు కథ మొదలుపెట్టాడు. హీరో, హీరోయిన్‌ల లవ్ ట్రాక్ ఆసక్తికరంగా మొదలైంది.. కానీ కథ నడిచే కొద్దీ ఆ సన్నివేశాలు పేలవంగా అనిపిస్తాయి.

కొన్ని సన్నివేశాలు పూర్తిగా రొటీన్‌గా సాగిపోతూ, ఎక్కడా ఎమోషనల్‌గా కనెక్ట్ అయ్యేలా లేవు. అలీ, పృథ్వీరాజ్ లాంటి సీనియర్ నటులను వృథా చేయడం, పాటల ప్లేస్‌మెంట్ పేలవంగా ఉండటం వంటి అంశాలు సినిమాలో మైనస్ లుగా చెప్పొచ్చు. చివర్లో ఓ చిన్న ట్విస్ట్‌ ట్రై చేసినా, అది పెద్దగా ప్రభావం చూపించలేదు.

నటీనటులు, సాంకేతిక నిపుణులు

కమెడియన్ నుంచి విలన్ గా, హీరోగా అన్ని తరహా పాత్రల్లోనూ అదరగొడతాడు సుహాస్. ఇక ఈ సినిమాలోనూ రామ్ పాత్రలో తనదైన నటనను ప్రదర్శించాడు. ఈ సినిమాకోసం పాట కూడా పాడాడు, డ్యాన్సుల్లోనూ అదరగొట్టాడు.

హీరోయిన్‌ మాళవిక మనోజ్‌కు ఇది తొలి తెలుగు చిత్రం అయినా, సత్యభామ పాత్రలో ఆకట్టుకుంది. ఈ సినిమాలో మరో సర్ప్రైజింగ్ 'నువ్వు నేను' హీరోయిన్ అనిత. హీరో తల్లి పాత్రలో అనిత కనిపించింది. ఇంకా.. అలీ, రవీందర్ విజయ్, బబ్లు పృథ్వీరాజ్, ప్రభాస్ శ్రీను, రఘు కారుమంచి వంటి సీనియర్ నటులు తమ పాత్రల పరిధి మేరకు నటించారు.

సినిమా సాంకేతికంగా బాగుంది. రథన్ ఇచ్చిన నేపథ్య సంగీతం కొన్ని సన్నివేశాలను బాగా ఎలివేట్ చేసింది. మణికందన్ సినిమాటోగ్రఫీ ప్రతి ఫ్రేమ్‌కి రిచ్‌ లుక్‌ను అందించింది. నిర్మాణ విలువలు అత్యున్నతంగా ఉండటంతో, బడ్జెట్ విషయంలో ఎక్కడా తగ్గలేదన్న విషయం స్పష్టంగా కనిపించింది. అయితే.. కథ, కథనాల విషయంలో దర్శకుడు ఇంకా కసరత్తు చేయాల్సింది.

చివరగా

ఆకట్టుకోని 'ఓ భామ అయ్యో రామ'

Telugu70MM: 2.5 / 5

Tags:    

Similar News