'కొత్త లోక' రివ్యూ

తెలుగులో ‘హలో, చిత్రలహరి‘ సినిమాల్లో నటించిన కళ్యాణి ప్రియదర్శన్ ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ‘కొత్త లోక‘. ‘ప్రేమలు‘ ఫేమ్ నస్లేన్‌ మరో కీలక పాత్రలో నటించాడు. మలయాళ స్టార్ దుల్కర్ సల్మాన్ నిర్మాణ సంస్థ వేఫేరర్ ఫిలిమ్స్ పై డొమినిక్ అరుణ్ దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కింది.;

By :  S D R
Update: 2025-08-30 11:49 GMT

నటీనటులు: కళ్యాణి ప్రియదర్శన్, నస్లేన్ తదితరులు

సినిమాటోగ్రఫీ: నిమిష్ రవి

సంగీతం: జేక్స్ బిజోయ్

ఎడిటింగ్ : చమన్ చక్కో

నిర్మాత: దుల్కర్ సల్మాన్

దర్శకత్వం: డామినిక్ అరుణ్

విడుదల తేది: ఆగస్టు 29, 2025

తెలుగులో ‘హలో, చిత్రలహరి‘ సినిమాల్లో నటించిన కళ్యాణి ప్రియదర్శన్ ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ‘కొత్త లోక‘. ‘ప్రేమలు‘ ఫేమ్ నస్లేన్‌ మరో కీలక పాత్రలో నటించాడు. మలయాళ స్టార్ దుల్కర్ సల్మాన్ నిర్మాణ సంస్థ వేఫేరర్ ఫిలిమ్స్ పై డొమినిక్ అరుణ్ దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కింది. తెలుగులో సితార ఎంటర్ టైన్ మెంట్స్ భారీ స్థాయిలో విడుదల చేసిన ‘కొత్త లోక‘ ఎలా ఉందో? ఈ రివ్యూలో చూద్దాం.

కథ

చంద్ర (కళ్యాణి ప్రియదర్శన్) సాధారణంగా కనిపించినా, ఆమెకు అసాధారణమైన అతీంద్రియ శక్తులు ఉంటాయి. నిజానికి ఆమె అసలు పేరు నీలి. రాజుల కాలంలో ఓ గిరిజన తండాలో జన్మించి, దుర్మార్గ రాజు వల్ల గూడెం నాశనం కావడంతో ఒక రహస్య శక్తిని సంపాదించిన ఆమె అమరత్వాన్ని పొందుతుంది. తల్లి మాట ప్రకారం మంచిపనులు చేస్తూ శతాబ్దాలుగా జీవించే నీలి, ఆధునిక కాలంలో చంద్ర పేరుతో బెంగళూరుకు వస్తుంది.

అక్కడ సాధారణ అమ్మాయిలా బేకరీలో పనిచేస్తూ, తన శక్తులను దాచిపెడుతుంది. ఎదురింట్లో నివసించే సన్నీ (నస్లేన్) ఆమెతో స్నేహం పెంచుకుంటాడు. ఇదే సమయంలో నగరంలో మాఫియా, రాజకీయ నేతల మద్దతుతో ఆర్గాన్ ట్రాఫికింగ్ జరుగుతుంటుంది. ఈ అక్రమాలను చూసిన చంద్ర తన పవర్స్‌తో ఎదుర్కొంటుంది.

మరోవైపు పోలీస్ ఇన్‌స్పెక్టర్ నాచియప్ప (శాండి మాస్టర్)కు చంద్రపై అనుమానం మొదలవుతుంది. ఆమె గతం, అసలు వ్యక్తిత్వం, శతాబ్దాలుగా దాచిన రహస్యాలు ఒక్కొక్కటిగా బయటికొస్తాయి. చివరకు నీలి అలియాస్ చంద్ర తన శక్తులతో సమాజానికి ఎదురైన చెడును ఎలా జయించింది అనేదే ఈ కథ.

విశ్లేషణ

సాధారణంగా సూపర్ హీరో సినిమాలు అనగానే మనకి హాలీవుడ్ గుర్తొస్తుంది. ‘హనుమాన్’తో తెలుగు ప్రేక్షకులు సూపర్ హీరో జానర్‌లో కొత్త అనుభూతిని పొందారు. ఇప్పుడు మలయాళంలో కూడా ఇలాంటిదే ప్రయత్నం చేశారు. దుల్కర్ సల్మాన్ నిర్మాణ సంస్థ వేఫేరర్ ఫిలిమ్స్ నిర్మించి, డొమినిక్ అరుణ్ దర్శకత్వం వహించిన ‘లోక చాప్టర్ 1: చంద్ర’ సినిమాని తెలుగులో ‘కొత్త లోక’ పేరుతో విడుదల చేశారు.

సినిమా మొదలు కావడంతోనే చంద్ర (కళ్యాణి ప్రియదర్శన్) తన సూపర్ పవర్స్‌తో ఫైట్ చేయడం చూపిస్తారు. కొన్ని కారణాల వల్ల ఆమె బెంగళూరుకు వస్తుంది. ఇక్కడ ఎదురింట్లో ఉండే సన్నీ (నస్లేన్)తో పరిచయం అవుతుంది. ఒక సాధారణ అమ్మాయిలా జీవించాలని అనుకున్న చంద్ర, ఓ సందర్భంలో గొడవలో ఒకరిని కొట్టడంతో రౌడీ గ్యాంగ్ ఆమె జీవితంలోకి అడుగుపెడుతుంది. ఆ తర్వాత చంద్ర లైఫ్ ఎలాంటి మలుపులు తిరిగిందనేదే కథ.

సినిమా ఫస్టాఫ్ ఆసక్తికరంగా సాగుతుంది. చంద్రకు ఉన్న సూపర్ పవర్స్, వాటితో వచ్చే ఫైట్ సీన్స్ బాగా ఎంటర్‌టైన్ చేస్తాయి. మహిళా సెంట్రిక్ కథను సింపతి కోణంలో కాకుండా యోధురాలిగా ప్రెజెంట్ చేయడం ఈ కథలో కొత్తదనం. పురాణాల్లో వినిపించే యక్షిణి పాత్రను ఆధునిక సూపర్ హీరో టెంప్లేట్‌లో చూపించడం మరో ప్రత్యేకత.

ప్రీ-ఇంటర్వెల్ బ్లాక్ బాగా రాసి, అద్భుతంగా ఎగ్జిక్యూట్ చేశారు. జేక్స్ బిజోయ్ సంగీతం ఈ సీక్వెన్స్‌ను ఎలివేట్ చేసింది. టోవినో, దుల్కర్, సౌబిన్ వంటి మలయాళీ స్టార్స్ గెస్ట్ రోల్స్ ఈ మూవీకి అదనపు ఆకర్షణలు.

నటీనటులు, సాంకేతిక నిపుణులు

ఇప్పటివరకు ఎక్కువగా రొమాంటిక్ లవ్ స్టోరీస్ లో కనిపించిన కల్యాణి ప్రియదర్శన్, ఈసారి మాత్రం సూపర్ పవర్స్ ఉన్న అమ్మాయి చంద్రగా అదరగొట్టింది. ఈ పాత్రలోని మానసిక సంఘర్షణను కూడా బాగా ప్రదర్శించింది. చంద్ర వెంటపడే అమాయక యువకుడి పాత్రలో ‘ప్రేమలు’ ఫేమ్ నస్లెన్ కె గఫూర్ బాగా చేశాడు. అతని మిత్రబృందం కామెడీతో హాయిగా ఎంటర్టైన్ చేసింది. పోలీస్ ఆఫీసర్‌గా నటించిన కొరియోగ్రాఫర్ శాండీ క్యారెక్టర్ కూడా గుర్తుండిపోతుంది. ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన విషయం ఏంటంటే హీరోలు టొవినో థామస్, దుల్కర్ సల్మాన్, ‘కూలీ’ ఫేమ్ సౌబిన్ షాహిర్ అతిథి పాత్రల్లో మెరిశారు.

టెక్నికల్ పరంగా సినిమాకి మంచి బలం ఉంది. జేక్స్ బెజోయ్ కంపోజ్ చేసిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ సినిమాకి సరిగ్గా సెట్ అయ్యింది. సినిమాటోగ్రాఫర్ నిమిష్ రవి విజువల్స్‌ను నెక్స్ట్ లెవల్‌లో చూపించాడు. యానిక్ బెన్ యాక్షన్ కొరియోగ్రఫీ కూడా ఈ సినిమాకి మేజర్ హైలైట్.

చివరగా

ఒక కొత్త సినిమా కొత్తగా చూడాలి అంటే ‘కొత్త లోక‘ చూడండి...

Telugu70MM Rating: 3 / 5

Tags:    

Similar News