'8 వసంతాలు' సినిమా రివ్యూ

నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ తీసుకొచ్చిన అచ్చమైన ప్రేమకథ '8 వసంతాలు'. 'మ్యాడ్' ఫేమ్ అనంతిక సనీల్‌కుమార్ ప్రధాన పాత్రలో ఫణీంద్ర నార్సెట్టి తెరకెక్కించిన '8 వసంతాలు' ఎలా ఉందో? ఈ రివ్యూలో చూద్దాం.;

By :  S D R
Update: 2025-06-20 01:09 GMT

నటీనటులు: అనంతిక సనీల్‌కుమార్, రవి దుగ్గిరాల, హను రెడ్డి, కన్న పసునూరి తదితరులు

సినిమాటోగ్రఫీ: విశ్వనాథ్ రెడ్డి

సంగీతం: హేషమ్ అబ్దుల్ వహాబ్

ఎడిటింగ్ : శశాంక్ మాలి

నిర్మాతలు: నవీన్ యెర్నేని & వై రవిశంకర్

దర్శకత్వం: ఫణీంద్ర నార్సెట్టి

విడుదల తేది: జూన్ 20, 2025

ఒకప్పుడు తెలుగులో భారీ బడ్జెట్ తో రూపొందే సినిమాలతో పాటు.. స్వచ్ఛమైన ప్రేమకథలు ఎక్కువగా రూపొందేవి. కానీ.. టాలీవుడ్ పాన్ ఇండియా మూవీస్ పై ఫోకస్ పెట్టడంతో కమర్షియల్ సినిమాలకే ప్రాధాన్యత ఇస్తున్నారు మేకర్స్. ఇక ఇలాంటి సమయంలోనూ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ ప్రేక్షకుల కోసం ఓ ప్రేమకథను తీసుకొచ్చింది. అదే ‘8 వసంతాలు‘. 'మ్యాడ్' ఫేమ్ అనంతిక సనీల్‌కుమార్ ప్రధాన పాత్రలో ఫణీంద్ర నార్సెట్టి తెరకెక్కించిన '8 వసంతాలు' ఎలా ఉందో? ఈ రివ్యూలో చూద్దాం.

కథ

‘8 వసంతాలు’ సినిమా శుద్ధి అయోధ్య (అనంతిక సనీల్ కుమార్) అనే యువతి జీవితంలో 8 వసంతాలు (11 నుండి 19 సంవత్సరాల వయస్సు వరకు) ప్రయాణాన్ని చూపిస్తుంది. తండ్రి మరణంతో బాధలో ఉన్న శుద్ధి, ఆ బాధ నుండి బయటపడేందుకు రచయితగా మారుతుంది. అలా వరుసగా పుస్తకాలు రాస్తూ, ట్రావెలింగ్ చేస్తూ ఉండే ఆమెకు కరాటే అంటే కూడా చాలా ఇష్టం.

ఈక్రమంలో ఇండియాలో ఉన్న ఆస్తులు అమ్మడం కోసం ఊటీ వచ్చిన వరుణ్ (హను రెడ్డి) శుద్ధితో ప్రేమలో పడతాడు. అతని కేరింగ్ చూసి శుద్ధి కూడా అతన్ని ఇష్టపడుతుంది. కానీ వరుణ్ ఆమెను మోసం చేసి అమెరికా వెళ్లిపోతాడు. ఆ బాధ నుంచి కోలుకుని మరో పుస్తకం రాసిన ఆమెకు రచయిత సంజయ్ (రవి దుగ్గిరాల) పరిచయం అవుతాడు. మరి.. శుద్ది-సంజయ్ ప్రేమ సఫలమైందా? ఈకోవలో శుద్ది జీవితంలోకి వచ్చిన మరో యువకుడు ఎవరు? అనేది తెరపై చూడాల్సిందే.

విశ్లేషణ

‘8 వసంతాలు’ ఒక సున్నితమైన, భావోద్వేగపూరితమైన ప్రేమకథగా తెరకెక్కింది. ఈ చిత్రం రెగ్యులర్ కమర్షియల్ సినిమాల నుండి ఓ డిఫరెంట్ అనుభవాన్ని అందిస్తుంది. ‘మధురం’ షార్ట్ ఫిల్మ్, 'మను' చిత్రాలతో గుర్తింపు పొందిన ఫణీంద్ర నార్సెట్టి ఈ చిత్రంలో తనదైన కవితాత్మక శైలిని ప్రదర్శించాడు.

సినిమాకు అతిపెద్ద బలం దాని విజువల్ బ్యూటీ. కాశ్మీర్, ఊటీ, వారణాసి వంటి అద్భుతమైన లొకేషన్స్‌లో షూట్ చేసిన ఈ చిత్రంలోని ప్రతీ ఫ్రేమ్ ను ఓ పెయింటింగ్ లా తీర్చిదిద్దారు. ప్రతి సన్నివేశం దృశ్యపరంగా ఆకట్టుకుంటుంది.

ఫణీంద్ర నార్సెట్టి కథను కవితాత్మకంగా చెప్పే ప్రయత్నం చేశాడు. సినిమా రివర్స్ నేరేషన్ శైలి ఆసక్తికరంగా ఉంది. ఒక బలమైన స్త్రీ పాత్ర చుట్టూ తిరిగే ఈ కథ ప్రేక్షకులకు భావోద్వేగంగా కనెక్ట్ అవుతుంది.

సినిమా ఫస్ట్ హాఫ్ ఆకట్టుకున్నప్పటికీ, సెకండ్ హాఫ్‌లో కథనం కొంత సాగదీతగా అనిపిస్తుంది. కొన్ని సన్నివేశాలు మరింత ట్రిమ్ చేసి ఉంటే, సినిమా ప్రభావం మరింత బలంగా ఉండేది. అలాగే ఫణీంద్ర కవితాత్మక సంభాషణలు రాసే ప్రయత్నం కొన్ని చోట్ల బలవంతంగా అనిపిస్తుంది. ఈ డైలాగ్స్ కొంతమంది ప్రేక్షకులకు కనెక్ట్ కాకపోవచ్చు, ముఖ్యంగా కమర్షియల్ సినిమాలు ఇష్టపడే వారికి.

నటీనటులు, సాంకేతిక నిపుణులు

అనంతిక సనీల్ కుమార్, శుద్ధి అయోధ్య పాత్రలో అద్భుతంగా నటించింది. ఆమె భావోద్వేగ నటన, ముఖ్యంగా మార్షల్ ఆర్ట్స్ సన్నివేశాలలో చూపించిన నైపుణ్యం, ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. ఆమె కరాటేలో బ్లాక్ బెల్ట్ మరియు కళరి, వింగ్ చున్ ఆర్ట్ ఫామ్‌లలో శిక్షణ తీసుకోవడం ఆమె పాత్రకు ప్రామాణికతను జోడించింది. రవితేజ దుగ్గిరాల, హను రెడ్డి, కన్న పసునూరి తమ తమ పాత్రలకు న్యాయం చేశారు. ఇంకా కార్తిక్, అనిత, హీరోయిన్ తల్లి పాత్రలు తమ స్థాయిలో ఆకట్టున్నారు.

హేషమ్ అబ్దుల్ వహాబ్ అందించిన సంగీతం సినిమాకు ప్రాణం పోసింది. పాటలు, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ఆహ్లాదకరంగా ఉంటాయి, కథాంశానికి భావోద్వేగ లోతును జోడిస్తాయి. వనమాలి రాసిన సాహిత్యం కూడా పాటలకు అదనపు ఆకర్షణను తెచ్చింది. విశ్వనాథ్ రెడ్డి అందించిన సినిమాటోగ్రఫీ అద్భుతం. ప్రతి ఫ్రేమ్ దృశ్యపరంగా ఆకర్షణీయంగా ఉంది. శశాంక్ మాలి ఎడిటింగ్ సినిమాను సజావుగా నడిపించినప్పటికీ, కొన్ని సన్నివేశాలు ట్రిమ్ చేస్తే మరింత బెటర్‌గా ఉండేది. వింగ్ చున్ అంజి కొరియోగ్రఫీ చేసిన యాక్షన్ సన్నివేశాలు ఆకట్టుకున్నాయి, అయితే కొంతమంది ప్రేక్షకులు వీటిని కథకు అనవసరంగా భావించవచ్చు. ఫైనల్ గా మైత్రీ మూవీ మేకర్స్ ప్రొడక్షన్ వేల్యూస్ బాగున్నాయి.

చివరగా

మొత్తంగా '8 వసంతాలు' సినిమా ఫస్ట్ హాఫ్ బాగుంది. ఇంటర్వెల్స్ సీన్ అయితే అదిరింది. సెకండ్ హాఫ్ స్లోగా ఉన్నా కాశీ ఫైట్ & క్లైమాక్స్ తో మెప్పించాడు దర్శకుడు. ఈ మధ్య కాలంలో వచ్చిన ఫీల్ గుడ్ లవ్ స్టోరీ '8 వసంతాలు'గా చెప్పొచ్చు.

Telugu 70mm Rating: 3/5

Tags:    

Similar News