బ్యాంకుల సహకారంతోనే రాష్ట్ర అభివృద్ధి : సీఎం
231వ రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల కమిటీ సమావేశం అమరావతిలో నిర్వహణ,'ఒక కుటుంబం – ఒక పారిశ్రామిక వేత్త’ కార్యక్రమానికి బ్యాంకులు ముందుకు రావాలి;
అమరావతి సచివాలయంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన 231వ రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల కమిటీ (SLBC) సమావేశం జరిగింది. ఈ సమావేశంలో రాష్ట్ర ఆర్థికాభివృద్ధి, రైతుల సమస్యలు, చిన్న పారిశ్రామిక వేత్తల ప్రోత్సాహం వంటి పలు అంశాలపై చర్చ జరిగింది.
సమావేశంలో గతంలో తీసుకున్న నిర్ణయాలు ఎంతవరకు అమలు అయ్యాయో Action Taken Report రూపంలో సమీక్షించారు. అమలు సరిగా జరగని అంశాలపై వెంటనే చర్యలు తీసుకోవాలని సీఎం స్పష్టం చేశారు.
ప్రతి కుటుంబం నుంచి కనీసం ఒకరు పారిశ్రామిక వేత్తగా ఎదగాలని లక్ష్యంగా ప్రభుత్వం చేపట్టిన “ఒక కుటుంబం – ఒక పారిశ్రామిక వేత్త” కార్యక్రమంపై ముఖ్యమంత్రి ప్రత్యేకంగా చర్చించారు. ఈ కార్యక్రమం విజయవంతం కావాలంటే బ్యాంకులు ముందుకు వచ్చి తగిన రుణాలు ఇవ్వాలని ఆయన సూచించారు.
రాష్ట్రంలోని అన్ని 175 నియోజకవర్గాల్లో MSME పార్కులు ఏర్పాటు చేయాలని సీఎం ప్రణాళికలు వివరించారు. చిన్న, మధ్య తరహా పరిశ్రమలు ఏర్పడితే గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి అవకాశాలు పెరిగి, యువతకు కొత్త అవకాశాలు వస్తాయని ఆయన తెలిపారు.రైతుల సమస్యలపై దృష్టి సారించిన సీఎం, ఖరీఫ్ సీజన్‌లో ఇప్పటికే సగం సమయం గడిచిపోయిందని గుర్తు చేశారు. ఈ సమయంలోనే రైతులకు రుణాలు, విత్తన సబ్సిడీలు అందించకపోతే వారికి ఎలాంటి ప్రయోజనం ఉండదని స్పష్టం చేశారు. సీజన్ చివర్లో రుణాలు ఇవ్వడం వల్ల ప్రయోజనం ఉండదని హెచ్చరించారు.
బ్యాంకులు తమ పద్ధతులను మార్చుకోవాలని ముఖ్యమంత్రి సూచించారు. మారుతున్న ప్రపంచానికి అనుగుణంగా కొత్త ఆలోచనలు, ఆవిష్కరణలు అవసరమని ఆయన తెలిపారు. ప్రజలను నియంత్రించే విధానాల కంటే, ప్రోత్సహించే విధానాలు అవలంబించాల్సిన అవసరాన్ని ఆయన గుర్తు చేశారు.
2047 నాటికి భారతదేశం బలమైన ఆర్థిక శక్తిగా ఎదగాలని లక్ష్యంగా పెట్టుకున్నామని ముఖ్యమంత్రి చెప్పారు. ఆ దిశగా బ్యాంకులు, ఆర్థిక సంస్థలు కొత్త మార్గాలు అన్వేషించాలని పిలుపునిచ్చారు. ఉత్పాదకత లేని రుణాలు మంచివి కావని, పేదలు–ధనికుల మధ్య తేడాను తగ్గించేలా రుణాలు ఇవ్వాలని ఆయన సూచించారు.
ఆర్థికశాస్త్రం చదివిన విద్యార్థిగా, ప్రజాప్రతినిధిగా ఎప్పుడూ పేదల కోసం మాత్రమే ఆలోచిస్తానని సీఎం అన్నారు. దేశంలో సంపద సృష్టి, ఆర్థికాభివృద్ధి లక్ష్యంగా బ్యాంకులు, ఆర్థిక సంస్థలు పని చేయాలని ఆయన స్పష్టం చేశారు.