విశాఖలో రాజనాథ్ సింగ్ ఆవిష్కరించిన యుద్ధనౌకలు
INS ఉదయగిరి & హిమగిరి – ప్రాజెక్ట్ 17A కింద నిర్మించిన యుద్ధనౌకలు - మేక్ ఇన్ ఇండియాలో 75% స్వదేశీ భాగాలతో నిర్మించిన యుద్ధ నౌకలు;
2025 ఆగస్టు 26న రక్షణ మంత్రి రాజనాథ్ సింగ్, విశాఖపట్నం ఈస్టర్న్ నేవల్ కమాండ్‌లో జరిగిన ప్రతిష్టాత్మకమైన కార్యక్రమంలో రెండు ఆధునిక యుద్ధనౌకలను 'ఐఎన్‌ఎస్ ఉదయగిరి (INS Udaygiri)' , ఐఎన్‌ఎస్ హిమగిరి (INS Himgiri)' లను భారత నౌకాదళానికి అంకితం చేశారు. ఇవి రెండూ ప్రాజెక్ట్ 17A కింద నిర్మించిన స్టెల్త్ ఫ్రిగెట్లు. ఈ రెండు యుద్ధనౌకలను ఒకేసారి, రెండు వేర్వేరు షిప్‌యార్డుల్లో నిర్మించి, జాతికి అంకితం చేయడం ఇదే తొలిసారి.
ఈ ఫ్రిగెట్లు ఆధునిక సాంకేతికతతో నిర్మించబడి, శత్రువులకు కనీసం గుర్తు కూడా పట్టకుండా సముద్రంలో సాఫీగా ప్రయాణించగలవు. వీటిలో లాంగ్ రేంజ్ మిసైళ్లు, బ్రహ్మోస్ సూపర్ సోనిక్ మిసైళ్లు, రాకెట్ లాంచర్లు, టార్పెడో లాంచర్లు వంటి శక్తివంతమైన ఆయుధ వ్యవస్థలు ఉన్నాయి. అలాగే, కంప్యూటర్ ఆధారిత కాంబాట్ మేనేజ్‌మెంట్ సిస్టమ్, ఫైర్ కంట్రోల్ సిస్టమ్ వంటివి ఏర్పాటు చేశారు. ఇవి దాడి చేయడమే కాకుండా, రక్షణలోనూ అగ్రగామి.
ఈ రెండు యుద్ధనౌకల్లో దాదాపు 75 శాతం భాగాలు దేశంలోనే తయారు చేయబడ్డాయి. అంటే, “మేక్ ఇన్ ఇండియా” భావనకు నౌకాదళం మరింత బలాన్ని ఇచ్చిందని చెప్పాలి. దీని వల్ల భారతదేశం ఇతర దేశాలపై ఆధారపడకుండా, స్వదేశీ రక్షణ రంగాన్ని ముందుకు తీసుకెళ్తోంది. రక్షణ మంత్రి కూడా ఈ విషయాన్ని ప్రత్యేకంగా ప్రస్తావిస్తూ, ఇది భవిష్యత్తులో భారత సైనిక బలానికి పెద్ద విజయమని అన్నారు.
రాజనాథ్ సింగ్ సభలో మాట్లాడుతూ ఆపరేషన్ సిందూర్ గురించి ప్రస్తావించారు. ఆయన మాటల్లో, ఆపరేషన్ సిందూర్ భారత నౌకాదళ శక్తిని, దూకుడును చూపించే చర్య. అది కేవలం “వార్మప్” మాత్రమే అని, భారత నౌకాదళం పూర్తి స్థాయిలో దాడి చేసుంటే, పాకిస్థాన్ నాలుగు ముక్కలైపోయేది అని స్పష్టంగా హెచ్చరించారు. ఈ వ్యాఖ్యలు పాకిస్థాన్ పై ఒక గట్టి హెచ్చరికగా నిలిచాయి.
రక్షణ మంత్రి తన ప్రసంగంలో, దేశ భద్రతకు నౌకాదళం ఎంత ముఖ్యమో వివరించారు. సముద్రం ద్వారా వచ్చే ముప్పులు, శత్రు దేశాల కుతంత్రాలు, అంతర్జాతీయ వాణిజ్య మార్గాల రక్షణ అన్నిటిలోను భారత నౌకాదళం కీలక పాత్ర పోషిస్తోందని అన్నారు. INS ఉదయగిరి, హిమగిరి లాంటి యుద్ధనౌకలు ఇప్పుడు చేరడంతో భారతదేశం సముద్రంలో మరింత శక్తివంతమైందని స్పష్టం చేశారు.2050 నాటికీ మరో 200 యుద్ధ నౌకలు నిర్మాణం చేస్తాం అని తెలిపారు.
మొత్తం మీద, విశాఖపట్నంలో జరిగిన ఈ ఆవిష్కరణ ఒక చారిత్రాత్మక ఘట్టం. స్వదేశీ సాంకేతికతతో నిర్మించిన రెండు శక్తివంతమైన యుద్ధనౌకలు ఇప్పుడు భారత సముద్ర సరిహద్దులను కాపాడేందుకు సిద్ధమయ్యాయి. అదే సమయంలో, ఆపరేషన్ సిందూర్ ప్రస్తావనతో రాజనాథ్ సింగ్ శత్రు దేశాలకు స్పష్టమైన హెచ్చరిక ఇచ్చారు. భారతదేశం అవసరమైతే ఎటువంటి స్థాయిలోనైనా ప్రతిస్పందించగలదని ఆయన హెచ్చరించారు.