వినాయక చవితి వేళ తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు
ఉత్తరాంధ్రలో వర్షాలు ప్రారంభం – శ్రీకాకుళం జిల్లాలో ఆగకుండా కురుస్తున్న వర్షాలు - వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడనం మరింత బలపడే సూచనలు;
తెలుగు రాష్ట్రాల్లో మరోసారి వర్షాలు మొదలయ్యాయి. వినాయక చవితి సందర్భంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ఇప్పటికే ఉత్తరాంధ్రలో వర్షాలు పడుతున్నాయి. శ్రీకాకుళం జిల్లాలో నిరంతరంగా వర్షం కొనసాగుతోంది.
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో రాబోయే మూడు రోజులు వర్షాలు మరింతగా పెరిగే అవకాశం ఉంది. ఈ ప్రభావం కారణంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణలోని పలు జిల్లాల్లో మోస్తరు నుండి భారీ వర్షాలు పడతాయని వాతావరణ కేంద్రం తెలిపింది.
హైదరాబాద్ వాతావరణ కేంద్రం సమాచారం ప్రకారం, వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడిన ఈ అల్పపీడనం పశ్చిమ-వాయువ్య దిశగా కదులుతూ మరింత బలపడనుంది. దీని ప్రభావంతో మూడు రోజుల పాటు రాష్ట్రంలో భారీ నుండి అతిభారీ వర్షాలు కురిసే అవకాశముందని అధికారులు స్పష్టం చేశారు.
ప్రత్యేకంగా మంగళవారం జయశంకర్ భూపాలపల్లి, ములుగు జిల్లాల్లో అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉండటంతో ఈ రెండు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. అలాగే మహబూబాబాద్, వరంగల్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో కూడా భారీ వర్షాలు పడే అవకాశం ఉందని హెచ్చరించారు.
వర్షాలతో పాటు ఉరుములు, మెరుపులు, గంటకు 30-40 కి.మీ. వేగంతో గాలులు వీసే అవకాశముందని వాతావరణ శాఖ తెలిపింది. ఇప్పటికే హైదరాబాద్‌లో ఆకాశం మేఘావృతంగా ఉంది. చందానగర్, మియాపూర్, కొండాపూర్, గచ్చిబౌలి, దిల్‌షుక్ నగర్ వంటి ప్రాంతాల్లో మోస్తరు వానలు కురుస్తున్నాయి.
వరంగల్ జిల్లా పరిధిలోనూ తేలికపాటి నుండి మోస్తరు జల్లులు పడుతున్నాయి. హనుమకొండ, కాజీపేటల్లో ఉదయం నుంచి వర్షం కొనసాగుతోంది. మరో మూడు రోజుల పాటు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అవసరమైతే ఇంట్లోనే ఉండాలని వాతావరణ శాఖ సూచించింది.