తెలంగాణ ఉమెన్ కమిషన్‌కు క్షమాపణలు చెప్పిన వేణు స్వామి
తెలంగాణ ఉమెన్ కమిషన్‌కు క్షమాపణలు చెప్పిన వేణు స్వామి. నేడు తెలంగాణ ఉమెన్ కమిషన్ కార్యాలయంలో హాజరైన వేణు స్వామి, తన వ్యాఖ్యలను ఉపసంహరించుకున్నాడు.;
జ్యోతిష్య నిపుణుడిగా పేరుగాంచిన వేణు స్వామి ఆమధ్య హీరో నాగచైతన్యపై చేసిన వ్యాఖ్యల కారణంగా వివాదంలో చిక్కుకున్నాడు. నాగచైతన్య, శోభిత ధూళిపాళ్ల మధ్య సంబంధం ఎక్కువ కాలం నిలవదని, త్వరలోనే వారు విడిపోతారని జోష్యం చెప్పడం ఆయనకు సమస్యగా మారింది. ఈ వ్యాఖ్యలు మహిళల గౌరవాన్ని దెబ్బతీసేలా ఉన్నాయని అభిప్రాయపడిన ఫిల్మ్ జర్నలిస్ట్ యూనియన్ అసోసియేషన్ సభ్యులు, తెలంగాణ ఉమెన్ కమిషన్‌కు ఫిర్యాదు చేశారు.
ఈ ఫిర్యాదు నేపథ్యంలో తెలంగాణ ఉమెన్ కమిషన్ వేణు స్వామికి నోటీసులు జారీ చేసింది. అయితే, ఈ నోటీసులను సవాలు చేస్తూ వేణు స్వామి హైకోర్టును ఆశ్రయించారు. కానీ, హైకోర్టు ఈ వ్యవహారంలో ఉమెన్ కమిషన్ ముందు హాజరు కావాల్సిందే అని స్పష్టం చేసింది. హైకోర్టు ఆదేశాల మేరకు ఉమెన్ కమిషన్ మరోసారి వేణు స్వామికి నోటీసులు పంపింది.
నేడు తెలంగాణ ఉమెన్ కమిషన్ కార్యాలయంలో హాజరైన వేణు స్వామి, తన వ్యాఖ్యలను ఉపసంహరించుకున్నాడు. తన మాటల వల్ల ఎవరికైనా హానీ జరిగి ఉంటే, అందుకు బహిరంగ క్షమాపణలు చెప్పాడు. మళ్లీ ఇలాంటి వ్యాఖ్యలు చేయబోనని స్పష్టం చేస్తూ, ఉమెన్ కమిషన్ ఆదేశాలకు కట్టుబడి ఉంటానని హామీ ఇచ్చాడు.
ఈ అంశంపై తీవ్రంగా స్పందించిన ఉమెన్ కమిషన్, వేణు స్వామికి మహిళల గౌరవం దెబ్బతినే విధంగా వ్యాఖ్యలు చేయడం అంగీకారయోగ్యం కాదని స్పష్టం చేసింది. ఇలాంటి వ్యాఖ్యలు భవిష్యత్తులో పునరావృతం కాకూడదని ఆయనను హెచ్చరించింది.