ఈ వార్తలో నిజమెంత?

మహేశ్ ఇప్పటికే యస్ యస్ యంబీ 30 గురించి ఆలోచిస్తున్నాడని... బుచ్చి బాబు సానా దర్శకత్వంలో ఓ సినిమా చేయబోతున్నాడని వార్తలొస్తున్నాయి.;

By :  K R K
Update: 2025-05-10 01:51 GMT

ఒక స్టార్ హీరో రాజమౌళితో సినిమా చేస్తుంటే.. సాధారణంగా ఇతర సినిమాలకు దూరంగా ఉంటారు. ఇది రాజమౌళి విధించిన నిబంధన కాదు, కానీ ఆయన సినిమాలు ఎంత ఫోకస్, డెడికేషన్ కావాలో తెలిసిన హీరోలు స్వయంగా ఇతర స్క్రిప్టులు, కమిట్‌మెంట్లను పక్కన పెడతారు. ‘ఆర్ఆర్ఆర్’ సమయంలో రామ్ చరణ్ ‘ఆచార్య’ లో నటించడం ఒక అరుదైన ఉదాహరణ.

ప్రస్తుతం మహేశ్ బాబు రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతోన్న యస్ యస్ యంబీ 29 సినిమాతో బిజీగా ఉన్నారు. వేసవి తీవ్రత కారణంగా ఆయన ఇటీవల ఒక నెలపాటు బ్రేక్ తీసుకున్నారు. ఇదే సమయంలో మహేశ్ ఇప్పటికే యస్ యస్ యంబీ 30 గురించి ఆలోచిస్తున్నాడని... బుచ్చి బాబు సానా దర్శకత్వంలో ఓ సినిమా చేయబోతున్నాడని వార్తలొస్తున్నాయి.

అయితే, ఈ వార్తల్లో నిజమెంత? అనేది పరిశీలిస్తే… బుచ్చి బాబు సానా ప్రస్తుతం రామ్ చరణ్‌తో తెరకెక్కుతోన్న "పెద్ది" సినిమాపైనే పూర్తిగా దృష్టి పెట్టారు. ఈ సినిమా బుచ్చి బాబుకు జీవితంలో ఒక స్పెషల్ అవకాశంగా మారిందని తెలిసిన వాళ్లు చెబుతున్నారు. అందుకే, ప్రతిదానికీ శ్రద్ధతో ప్లానింగ్ చేస్తున్నారు. మరో కథలు తయారు చేయడం, ఇతర హీరోలతో సమావేశాలు అయ్యే అవకాశం లేదు.

మరోవైపు, మహేశ్ బాబుకు రాజమౌళి సినిమా పూర్తయ్యేంతవరకూ కొత్త ప్రాజెక్టులు అన్నదే ప్రశ్నార్థకంగా ఉంది. యస్ యస్ యంబీ 29 ఓ భాగంగా ముగుస్తుందా? లేక సీక్వెల్స్ ఉంటాయా? అనే స్పష్టత ఇంకా రాలేదు. కానీ ఏది జరిగినా, ఇది రెండు సంవత్సరాల ప్రాజెక్టుగా కనిపిస్తోంది. అటువంటి సమయంలో మహేశ్ మరో ప్రాజెక్ట్ కమిట్ అవడం అసాధ్యమే.

Tags:    

Similar News