ఆకట్టుకుంటున్న మోహన్ లాల్ ‘తుడరుమ్’ తెలుగు ట్రైలర్

ఈ సినిమా ఏప్రిల్ 25న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఈ సందర్భంగా విడుదలైన తెలుగు ట్రైలర్ సినిమాపై అంచనాలను మరింత పెంచింది.;

By :  K R K
Update: 2025-04-22 06:33 GMT

మలయాళ లెజెండరీ యాకక్టర్ మోహన్‌లాల్ నటించిన తాజా చిత్రం 'తుడరుమ్' ప్రేక్షకుల్లో ఉత్కంఠతను రేకెత్తిస్తోంది. ఈ సినిమా ఏప్రిల్ 25న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఈ సందర్భంగా విడుదలైన తెలుగు ట్రైలర్ సినిమాపై అంచనాలను మరింత పెంచింది. క్రైమ్ కామెడీ థ్రిల్లర్‌గా రూపొందిన ఈ చిత్రంలో మోహన్‌లాల్ షణ్ముగం అనే టాక్సీ డ్రైవర్‌ పాత్రలో కనిపించనున్నారు. అతడి కారు చుట్టూ తిరిగే కథ... ఒక అనుకోని సమస్యలో ఇరుక్కోవడంతో ఆసక్తికర మలుపులు తీసుకుంటుంది. ఈ ట్రైలర్‌లో మోహన్‌లాల్‌ సహజసిద్ధమైన నటన, హాస్యం, ఉత్కంఠ రేకెత్తించే సన్నివేశాలు ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి. 'ఎందుకు ఆ కారును వదలలేకపోతున్నాడు?' అనే ప్రశ్నతో ట్రైలర్ సినిమాపై ఆసక్తిని రెట్టింపు చేస్తోంది.

ఈ చిత్రంలో మోహన్‌లాల్‌ కు జోడీగా సీనియర్ నటి శోభన కథానాయికగా నటిస్తుండటం విశేషం. దాదాపు 38 ఏళ్ల తర్వాత ఈ లెజెండరీ జోడి మళ్లీ తెరపై కనిపించనుంది. గతంలో వీరిద్దరూ కలిసి 55 సినిమాల్లో నటించారు, ఇప్పుడు 'తుడరుమ్'తో మరోసారి తమ కెమిస్ట్రీని చూపించనున్నారు. ఈ చిత్రానికి 'ఆపరేషన్ జావా' ఫేమ్ తరుణ్ మూర్తి దర్శకత్వం వహించారు. రాజపుత్ర విజువల్ మీడియా బ్యానర్‌పై ఎం. రంజిత్ నిర్మిస్తున్న ఈ సినిమా... ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా రూపొందింది. ఫర్హాన్ ఫాజిల్, మణియన్‌పిళ్ళై రాజు, బిను పప్పు వంటి నటులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ట్రైలర్‌లో చూపించిన అద్భుతమైన సినిమాటోగ్రఫీ, సంగీతం, స్క్రీన్‌ప్లే ఈ చిత్రం నాణ్యతను సూచిస్తున్నాయి.

మోహన్‌లాల్ ఇటీవల 'ఎల్‌2: ఎంపురాన్' సినిమాతో బ్లాక్‌బస్టర్ విజయాన్ని అందుకున్నారు. ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా రూ. 250 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టి, మలయాళ చిత్ర పరిశ్రమలో రికార్డు సృష్టించింది. ఈ విజయం నేపథ్యంలో 'తుడరుమ్' పై అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. ఈ సినిమా మలయాళంతో పాటు తెలుగులోనూ అదే రోజు విడుదల కానుంది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో 'దీపా ఆర్ట్స్' ద్వారా ఈ చిత్రం రిలీజ్ అవుతోంది. క్లాస్, మాస్ ప్రేక్షకులను ఒకేలా ఆకట్టుకునేలా రూపొందిన ఈ చిత్రం, మోహన్‌లాల్ ఫ్యామిలీ మ్యాన్‌గా, క్రైమ్ డ్రామాలో మెప్పించే నటనతో ప్రేక్షకులను అలరించనుంది. మరి ఈ సినిమా మోహన్ లాల్ కు ఏ రేంజ్ లో హిట్టిస్తుందో చూడాలి.


Full View


Tags:    

Similar News