కల్పన ఆరోగ్య పరిస్థితి.. నిజం ఏమిటి?
ప్రముఖ గాయని కల్పన ఇటీవల అనారోగ్యానికి గురికావడం, ఆమె భర్తపై మీడియాలో వస్తున్న కథనాలు కలకలం రేపాయి. నిద్ర సమస్యల కారణంగా టాబ్లెట్లు అధిక మోతాదులో తీసుకున్న ఆమె అపస్మారక స్థితికి చేరుకున్నారు. అయితే, ఇప్పుడు ఆమె కోలుకుంటున్నారు.
ఈ ఘటనపై సోషల్ మీడియా మరియు కొన్ని వార్తా మాధ్యమాల్లో అనేక ఊహాగానాలు వెల్లువెత్తడంతో, వాటిని ఖండిస్తూ స్వయంగా వీడియో విడుదల చేశారు కల్పన. '‘నా భర్తపై తప్పుడు ప్రచారం జరుగుతోంది. మా కుటుంబంలో మనస్పర్థలు లేవు. మేమంతా సంతోషంగా, అన్యోన్యంగా జీవిస్తున్నాం. నా భర్త సహాయంతోనే నా విద్యాభ్యాసాన్ని కొనసాగిస్తున్నాను. ఒత్తిడితో నిద్ర పట్టకపోవడంతో టాబ్లెట్లు వేసుకున్నాను. అది ఓవర్‌డోస్ కావడంతో స్పృహ తప్పిపోయాను' అని ఆమె వివరించారు.
ఈ ఘటనలో తన భర్త వేగంగా స్పందించడం, కాలనీవాసులు, పోలీసుల సమయోచిత చర్యల వల్లే తాను సురక్షితంగా బయటపడ్డానని చెప్పారు. త్వరలోనే పాటల ద్వారా అభిమానులను మళ్లీ అలరిస్తానని స్పష్టం చేశారు. అలాగే, తన భర్త తన జీవితానికి ఇచ్చిన ఉత్తమ బహుమతి అంటూ ఆయనపై తనకున్న గౌరవాన్ని, ప్రేమను వ్యక్తం చేశారు.