సరిగ్గా 35 ఏళ్ళకు అదే డేట్లో రీరిలీజ్ !
రీరిలీజ్ ట్రెండ్ బాగా ఊపందుకోవడంతో.. అభిమానులు "జగదేక వీరుడు అతిలోక సుందరి" చిత్రాన్ని మళ్లీ థియేటర్లలో చూసేందుకు కోరుకుంటున్నారు.;
మెగాస్టార్ చిరంజీవి కెరీర్ లో ఎన్నో అద్భుతమైన సినిమాలు వచ్చినా "జగదేక వీరుడు అతిలోక సుందరి" చిత్రం మాత్రం తరాలుగా ప్రేక్షకుల మనసుల్లో ప్రత్యేక స్థానం సంపాదించుకుంది. శ్రీదేవి సౌందర్యాన్ని వెండితెరపై అద్భుతంగా ఆవిష్కరించిన ఈ చిత్రానికి కె. రాఘవేంద్రరావు దర్శకుడు. ప్రముఖ నిర్మాత అశ్వినీ దత్ నిర్మించిన ఈ చిత్రంలో మేటి కథ, అద్భుతమైన విజువల్స్, ఉత్కంఠ భరితమైన స్క్రీన్‌ప్లే తో రూపొందిన ఈ సినిమాలో ఎన్నో మళ్లీ మళ్లీ చూడదగ్గ సన్నివేశాలు ఉన్నాయి.
ఈ చిత్రానికి ఇళయరాజా అందించిన సంగీతం ఇప్పటికీ ఇంకా ఫ్రెష్ గానే అనిపిస్తుంది. ఈ సినిమాకు సంబంధించిన ప్రతి పాటను నేటికీ ప్రతి తెలుగు సినిమా ప్రేమికుడు ఆస్వాదిస్తున్నాడు. హాస్య సన్నివేశాలు, ఫాంటసీ డ్రామా, విజువల్స్ అన్నీ కలసి, మంచి సినిమా చూసేద్దాం అనుకున్నప్పుడు గుర్తొచ్చే ఒక అపూర్వ కాంభినేషన్ ఇది. అలాంటి మహత్తరమైన ఈ సినిమాకు ఉండే మాయాజాలం ఇంతటి గొప్పది.
ఇటీవల రీరిలీజ్ ట్రెండ్ బాగా ఊపందుకోవడంతో.. అభిమానులు "జగదేక వీరుడు అతిలోక సుందరి" చిత్రాన్ని మళ్లీ థియేటర్లలో చూసేందుకు కోరుకుంటున్నారు. వారి అభ్యర్థనను గమనించిన నిర్మాతలు.. ఈ చిత్రాన్ని 2డీ తోపాటు 3డీ ఫార్మాట్‌లో కూడా తిరిగి విడుదల చేయాలని నిర్ణయించుకున్నారు. ఈ చిత్రం మే 9న 2డీ, 3డీ ఫార్మాట్లలో ప్రేక్షకుల ముందుకు రానుంది. నిజానికి రీరిలీజయ్యే టైమ్ కు ఈ మూవీ సరిగ్గా 35 ఏళ్ళు పూర్తి చేసుకోవడం విశేషం. సరిగ్గా 1990, మే 9న విడుదలైంది ‘జగదేకవీరుడు అతిలోకసుందరి’ చిత్రం. ఇప్పుడు ఈ సినిమా ఎలాంటి భారీ సంచలనాన్ని సృష్టిస్తుందో చూడాలి.