రాబోయే దేశభక్తి సినిమాలు ఇవే !
ఈ ఏడాది, వచ్చే ఏడాది తెలుగు, హిందీలో కొత్త దేశభక్తి సినిమాలు ధైర్యం, త్యాగం, గౌరవంతో నిండిన కథలను తెరపైకి తీసుకొస్తున్నాయి.;
భారతీయ సినిమాల్లో దేశభక్తికి ఎప్పుడూ ప్రత్యేక స్థానం ఉంటుంది. నిజ జీవిత హీరోల నుంచి కల్పిత యోధుల వరకు.. సినిమా తెర దేశ స్ఫూర్తిని సజీవంగా ఉంచింది. చాలా ధైర్యగాథలు థియేటర్లకు చేరకపోయినా.. చేరినవి భావో ద్వేగాలను రేకెత్తించి, స్ఫూర్తినిస్తాయి. ఈ ఏడాది, వచ్చే ఏడాది తెలుగు, హిందీలో కొత్త దేశభక్తి సినిమాలు ధైర్యం, త్యాగం, గౌరవంతో నిండిన కథలను తెరపైకి తీసుకొస్తున్నాయి.
దేశభక్తి చిత్రాల్లో ముందుగా చెప్పుకోదగ్గది ప్రభాస్ హీరోగా, హను రాఘవపూడి దర్శకత్వంలో వస్తున్న ‘ఫౌజీ’. ‘సీతా రామం’ ఫేమ్‌తో ఇతడు 1940 నేపథ్యంలో, స్వాతంత్ర్యానికి ముందు కథను చెబుతున్నాడు. ప్రభాస్ ఆజాద్ హింద్ ఫౌజ్‌తో ముడిపడిన సైనికుడిగా, రెండో ప్రపంచ యుద్ధ సంఘటనల్లో నటిస్తాడని టాక్. యుద్ధానికి కొత్త అర్థాన్నిచ్చే యోధుడి కథ అని టీమ్ హింట్ ఇస్తోంది. ఇమాన్వి ఇస్మాయిల్ హీరోయిన్‌గా, వచ్చే వేసవిలో సినిమా విడుదల కానుంది.
బాలీవుడ్ కూడా యుద్ధ కథలతో ఫుల్ జోష్‌లో ఉంది. సల్మాన్ ఖాన్ ‘బ్యాటిల్ ఆఫ్ గల్వాన్’ అనే మూవీతో రాబోతున్నాడు. ఈ మూవీ 2020లో భారత్-చైనా సైనికుల మధ్య జరిగిన ఘర్షణలను చూపిస్తుంది.
ఫర్హాన్ అక్తర్ ‘120 బహదూర్’ మూవీ.. 1962 రెజాంగ్ లా యుద్ధంలో మేజర్ శైతాన్ సింగ్, అతని సైనికుల కథను తెరకెక్కిస్తోంది. అలాగే.. రణదీప్ హూడా ‘ఆపరేషన్ ఖుక్రీ’ లో వెస్ట్ ఆఫ్రికాలో జరిగిన ధైర్యవంతమైన యూఎన్ శాంతి మిషన్ రెస్క్యూని చూపిస్తారు. ఇక ‘బోర్డర్ 2’ లో సన్నీ డియోల్, అడివి శేష్ స్పై థ్రిల్లర్ ‘జీ2’ , నిఖిల్ ‘ది ఇండియా హౌస్’, 1905 లండన్ విప్లవకారుల కథ, అగస్త్య నందా ఇక్కీస్లో యుద్ధ హీరో అరుణ్ ఖేత్రపాల్ కథలు లైనప్‌లో ఉన్నాయి.
ఇలాంటి బిగ్ లైనప్‌తో ఉత్తేజకర కథలు, బలమైన నటన, గర్వపడే క్షణాలు ఆడియన్స్‌ను థ్రిల్ చేయనున్నాయి. భారతీయ సినిమాలో దేశభక్తి జోష్ తగ్గడం లేదు. రాబోయే నెలల్లో తెరపై త్రివర్ణ పతాకం రెపరెపలాడనుంది. గత, వర్తమాన హీరోలకు థియేటర్లలో చప్పట్లు మారుమోగనున్నాయి.