మెగాస్టార్ ‘పున్నమినాగు’ చిత్రానికి 45 ఏళ్ళు

1980 జూన్ 13న విడుదలైన ఈ చిత్రం సరిగ్గా నేటికి 45 ఏళ్లు పూర్తి చేసుకుంది. కన్నడలో సూపర్‌హిట్‌గా నిలిచిన ‘హున్నిమియే రాత్రియళు’ చిత్రానికి రీమేక్‌గా రూపొందిన ఈ మూవీకి రాజశేఖర్ దర్శకుడు.;

By :  K R K
Update: 2025-06-13 06:06 GMT

మెగాస్టార్ చిరంజీవి కెరీర్‌కు బలమైన పునాది వేసిన సినిమా ‘పున్నమినాగు’. రాజశేఖర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో చిరంజీవి, నరసింహరాజు, రతి అగ్నిహోత్రి, రామదాసు, పద్మనాభం, మేనక కీలక పాత్రల్లో నటించారు. 1980 జూన్ 13న విడుదలైన ఈ చిత్రం సరిగ్గా నేటికి 45 ఏళ్లు పూర్తి చేసుకుంది. కన్నడలో సూపర్‌హిట్‌గా నిలిచిన ‘హున్నిమియే రాత్రియళు’ చిత్రానికి రీమేక్‌గా రూపొందిన ఈ మూవీకి రాజశేఖర్ దర్శకుడు. చక్రవర్తి ఆకట్టుకునే సంగీతం, చిరంజీవి, నరసింహరాజు, రతి అగ్నిహోత్రిల అద్భుతమైన నటనతో ప్రేక్షకులను మంత్రముగ్ధుల్ని చేసింది.

‘పున్నమినాగు’లో చిరంజీవి పోషించిన నాగులు పాత్ర ఒక రేర్ ఛాలెంజ్‌తో కూడినది. ఫిల్మ్ ఇన్‌స్టిట్యూట్ నుంచి వచ్చిన ఫ్రెష్ టాలెంట్‌గా, చిరంజీవికి అప్పటివరకు ఇండస్ట్రీలో పెద్దగా అనుభవం లేదు. అయినప్పటికీ, పాము లక్షణాలు కలిగిన ఒక కాంప్లెక్స్ క్యారెక్టర్‌ను పోషించడం అనేది సులభమైన టాస్క్ కాదు. కానీ, చిరంజీవి తనలోని నటనా ప్రతిభతో.. నాగులు పాత్రలో పూర్తిగా లీనమై, ఆ క్యారెక్టర్‌కు జీవం పోశారు. ఆయన డైలాగ్ డెలివరీ, ఎనర్జిటిక్ డ్యాన్స్ మూమెంట్స్ యువతను ఉర్రూతలూగించాయి. చిరంజీవి నటనలోని సహజత్వం, ఆయన స్క్రీన్ ప్రెజెన్స్ ప్రేక్షకులను కట్టిపడేసాయి.

ముఖ్యంగా సినిమా క్లైమాక్స్‌లో చిరంజీవి నటన అద్వితీయం. నాగులు పాము లక్షణాలు కలిగిన వ్యక్తిగా తెలిసిన తర్వాత.. హీరో నరసింహరాజు అతడిని పారిపోమని కోరుతాడు. ఆ సన్నివేశంలో చిరంజీవి పలికిన ... “ఎక్కడికి పోవాలి... పోతే పుట్టలోకే పోవాలి...’’ అనే డైలాగ్ ప్రేక్షకుల గుండెల్ని తాకడంతో పాటు, కంటతడి పెట్టించే ఎమోషనల్ ఇంపాక్ట్ సృష్టించింది. సో.. చిరంజీవి కెరీర్‌లో ఒక టర్నింగ్ పాయింట్‌గా నిలిచి, ఆయన్ను స్టార్‌డమ్ వైపు నడిపించిన ఘనత ‘పున్నమినాగు’ సొంతం.

Tags:    

Similar News