తెలుగు దర్శకుడు మృతి
తెలంగాణ జానపద కళారూపమైన ఒగ్గు కథ ఆధారంగా రూపొందించిన 'బ్రహ్మాండ' చిత్రంతో దర్శకుడిగా పరిచయం అవుతున్న సండ్రు నాగేశ్ అలియాస్ రాంబాబు (47) ఆకస్మికంగా మృతిచెందారు.;
తెలంగాణ జానపద కళారూపమైన ఒగ్గు కథ ఆధారంగా రూపొందించిన 'బ్రహ్మాండ' చిత్రంతో దర్శకుడిగా పరిచయం అవుతున్న సండ్రు నాగేశ్ అలియాస్ రాంబాబు (47) ఆకస్మికంగా మృతిచెందారు. హైదరాబాద్‌లోని ప్రసాద్ ల్యాబ్‌లో నాలుగు రోజుల క్రితం జరిగిన ఈ సినిమా ప్రివ్యూకు హాజరైన సమయంలో రాంబాబు బ్రెయిన్ స్ట్రోక్‌కు గురయ్యారు. వెంటనే అపోలో ఆసుపత్రికి తరలించినా పరిస్థితి విషమించటంతో అనంతరం నిమ్స్‌కు తరలించారు. చికిత్స పొందుతూ ఆయన కన్నుమూశారు.
రాంబాబు స్వస్థలం మెదక్ జిల్లా శివ్వంపేట మండలం అల్లీపూర్. ఆయనకు భార్య, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. సుదీర్ఘంగా సినీ పరిశ్రమలో పనిచేసిన రాంబాబు, దాదాపు 150 సినిమాలకు, 60 టీవీ సీరియళ్లకు కో-డైరెక్టర్‌గా సేవలందించారు. ‘అంతరంగాలు, అన్వేషణ’ వంటి సీరియళ్లకు కూడా ఆయన కీలకంగా పనిచేశారు. ‘బ్రహ్మాండ’ సినిమానే ఆయనకు దర్శకుడిగా తొలి చిత్రం కావడం గమనార్హం.
‘బ్రహ్మాండ‘ చిత్రం ఈ నెల 18న విడుదలకు సిద్ధమవుతోంది. ఈ చిత్రంలో సీనియర్ నటి ఆమని ప్రధాన పాత్రలో నటించగా, ‘బలగం‘ జయరాం, ఆనంద్ బాల్సాద్ ఇతర కీలక పాత్రల్లో నటించారు.