'లైలా' మూవీ వివాదంపై టీమ్ క్లారిటీ!
'లైలా' మూవీ వివాదంపై టీమ్ క్లారిటీ!'లైలా' మూవీ ప్రీ-రిలీజ్ ఈవెంట్‌లో నటుడు పృథ్వీ చేసిన కామెంట్స్ పెద్ద దుమారం రేపాయి. ఈ ఘటనపై సోషల్ మీడియాలో 'బాయికాట్ లైలా' అనే హ్యాష్‌ట్యాగ్ ట్రెండ్ అవ్వడం చిత్రయూనిట్‌ను షాక్‌కు గురిచేసింది. ఈ వివాదంపై మూవీ టీమ్ అధికారికంగా స్పందించింది.
నిర్మాత సాహు గారపాటి మాట్లాడుతూ 'ఈ వివాదం మా నోటీసుకు రాలేదు. ఒక సినిమా అంటే చాలా మంది కష్టపడతారు, దయచేసి సినిమాను ఒక వినోదాత్మక క్రియేటివ్ ప్రాజెక్ట్‌లా చూడండి. ఈవెంట్‌లో గెస్ట్‌లు ఏమి మాట్లాడతారో మాకు తెలియదు. అలాంటి మాటలతో సినిమాను బహిష్కరించడం అన్యాయం' అన్నారు.
హీరో విశ్వక్ సేన్ మాట్లాడుతూ 'ఈవెంట్‌లో జరిగిన దానికి మేము బాధ్యత వహిస్తున్నాము, కానీ అందరూ కలిసి తప్పు చేశామనేలా చూడకండి. పృథ్వీ చేసిన వ్యాఖ్యల గురించి మాకు ముందుగా తెలియదు. ఆయన మాట్లాడిన దానికి సినిమా బాధ్యత వహించాల్సిన అవసరం లేదు. సినిమాకు సంబంధం లేని విషయంలో మమ్మల్ని బలి చేయొద్దు' అని అభ్యర్థించాడు.
'తాము చిరంజీవి గారిని రిసీవ్ చేసుకోవడానికి వెళ్లినప్పుడు పృథ్వీ మాట్లాడారు. ఆ సమయంలో మా నియంత్రణలో ఏమీ లేదు. ఒకరి మాటల వల్ల మొత్తం టీమ్ శ్రమ వృధా చేయొద్దు' అంటూ ఈ వివాదంపై విశ్వక్ క్లారిటీ ఇచ్చాడు.