‘మిరాయ్‘లో పాటలు కట్!
మన సినిమాల విజయంలో పాటలకున్న ప్రాధాన్యం ఎంత చెప్పినా తక్కువే. పాటలే సినిమాకి క్రేజ్ తెస్తాయి, థియేటర్లలోకి ప్రేక్షకులను రప్పిస్తాయి.;
మన సినిమాల విజయంలో పాటలకున్న ప్రాధాన్యం ఎంత చెప్పినా తక్కువే. పాటలే సినిమాకి క్రేజ్ తెస్తాయి, థియేటర్లలోకి ప్రేక్షకులను రప్పిస్తాయి. అందుకే ఒక్కో పాట కోసమే కోట్లు ఖర్చు పెడుతుంటారు. కానీ విచిత్రం ఏమిటంటే అన్ని కోట్లు పెట్టి చిత్రీకరించిన పాటలు చివరకు సినిమాలో ఉండటం లేదు.
ఇటీవల తెలుగు నుంచి వచ్చిన కొన్ని సినిమాలలో ఈ ట్రెండ్ బాగా కనిపిస్తుంది. ‘దేవర‘ చిత్రం విడుదలకు ముందే బాగా పాపులరైన ‘దావూదీ‘ రిలీజ్ తర్వాత కట్ అయ్యింది. ‘కుబేర‘లో రష్మికపై చిత్రీకరించిన ‘పిప్పి ప్పి డుమ్ డుమ్‘ పాటదీ అదే తంతు. విజయ్ దేవరకొండ ‘కింగ్డమ్‘ నుంచి ఒక పాటను తీసేశారు.
లేటెస్ట్ గా ‘మిరాయ్‘ మూవీ నుంచి రెండు పాటలను తీసేయాల్సి వచ్చిందట. ఇప్పటికే ‘మిరాయ్‘ నుంచి రిలీజైన ‘వైబ్ ఉంది‘ పాట మంచి చార్ట్ బస్టర్ అయ్యింది. హీరోహీరోయిన్లు తేజ సజ్జ, రితిక నాయక్ లపై చిత్రీకరించిన ఈ పాటను సినిమా నుంచి తీసేశారు. సినిమా ఫ్లోకి అడ్డంగా ఉందని భావించిన టీమ్ ఈ నిర్ణయం తీసుకుంది.
మరోవైపు.. ఇదే చిత్రం కోసం నిధి అగర్వాల్ తో ఓ స్పెషల్ సాంగ్ షూట్ చేశారట. ఆ పాటనూ లేపేశారు. మొత్తంగా.. అభిమానుల మన్ననలు పొందిన పాటలను చివరికి స్క్రీన్‌పై చూపించకపోవడం ప్రేక్షకులకు నిరాశ కలిగించే విషయమే. అదేదో ముందే ప్లాన్ చేసుకుని ఆ పాటను షూట్ చేయకపోతే నిర్మాతకూ బడ్జెట్ ఆదా అయినట్టే కదా.