పుస్తక పఠనంపై రజనీకాంత్ కామెంట్స్!

తమిళ రచయిత ఎస్. వేంకటేశన్ రాసిన ‘వేల్పారి’ పుస్తకానికి పాఠకుల నుంచి విశేష స్పందన లభించిన నేపథ్యంలో, చెన్నైలో ఓ ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు.;

By :  S D R
Update: 2025-07-12 12:34 GMT

తమిళ రచయిత ఎస్. వేంకటేశన్ రాసిన ‘వేల్పారి’ పుస్తకానికి పాఠకుల నుంచి విశేష స్పందన లభించిన నేపథ్యంలో, చెన్నైలో ఓ ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. ఈ వేడుకకు సూపర్ స్టార్ రజనీకాంత్, దర్శకుడు శంకర్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.

ఈ పుస్తకాన్నే శంకర్ సినిమాగా తీయబోతున్నట్టుగా ప్రకటించారు. వెయ్యి కోట్లు బడ్జెట్ తో ఈ సినిమాని తెరకెక్కించనున్నట్టు శంకర్ తెలిపారు. మరోవైపు ఇదే వేడుకలో సూపర్ స్టార్ రజనీకాంత్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

రజనీకాంత్ తనదైన హాస్యశైలిలో మాట్లాడుతూ, '75 ఏళ్ల వయసులో కూలింగ్ గ్లాసులు పెట్టుకుని స్లో మోషన్‌లో నడిచే నన్నెందుకు ఈ పుస్తకం వేడుకకు పిలిచారో అర్థం కాలేదు' అంటూ నవ్వులు పూయించారు. పుస్తక పఠనం పట్ల తనకు ఉన్న ఆసక్తిని ఆయన ఈ సందర్భంగా వ్యక్తం చేశారు. రామకృష్ణ ఆశ్రమం ప్రభావంతో పుస్తకాలు చదవడం అలవాటయ్యిందని, రచయిత జయకంధన్ పుస్తకం ఒకదాన్ని చదివి కన్నీళ్లు పెట్టుకున్నానని చెప్పారు.

ఇలాంటి సాహిత్య కార్యక్రమాలకు కమల్ హాసన్, శివకుమార్ లాంటి మేధావుల్ని ఆహ్వానించాలన్నారు రజనీకాంత్. 'ఏం మాట్లాడాలనేది విజ్ఞానం, ఎలా మాట్లాడాలనేది ప్రతిభ, ఎంత మాట్లాడాలనేది స్టేజ్‌పై ఆధారపడి ఉంటుంది. ఏం చెప్పాలి, ఏం చెప్పకూడదనేది అనుభవం ద్వారా నేర్చుకోవాలి' అంటూ తన గత వ్యాఖ్యలపై వివాదం తలెత్తిన సందర్భాన్ని హాస్యంగా ప్రస్తావించారు.

ఇప్పటికే ‘వేల్పారి’ పుస్తకాన్ని 25 శాతం చదివానని, సినిమాల నుంచి రిటైర్మెంట్ తర్వాత మిగిలిన భాగాన్ని పూర్తిచేస్తానని తెలిపారు. శంకర్ తెరకెక్కించనున్న 'వేల్పారి' సినిమా కోసం తాను ఆసక్తిగా ఎదురు చూస్తున్నానన్నారు.

Tags:    

Similar News