పైరసీ చేసిన వ్యక్తి అరెస్ట్
తెలుగు సినీ పరిశ్రమను మరోసారి పైరసీ భూతం కలవరపెడుతోంది. ఈ మధ్యకాలంలో వరుసగా భారీ బడ్జెట్ చిత్రాలు పైరసీకి గురవుతుండగా, తాజాగా సైబర్ క్రైమ్ పోలీసులు కీలక చర్యలు చేపట్టారు.;
తెలుగు సినీ పరిశ్రమను మరోసారి పైరసీ భూతం కలవరపెడుతోంది. ఈ మధ్యకాలంలో వరుసగా భారీ బడ్జెట్ చిత్రాలు పైరసీకి గురవుతుండగా, తాజాగా సైబర్ క్రైమ్ పోలీసులు కీలక చర్యలు చేపట్టారు. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన కిరణ్ కుమార్ అనే యువకుడిని హైదరాబాద్‌లో అరెస్ట్ చేశారు. ఇతను విడుదలైన మొదటి రోజే సినిమాలను సెల్‌ఫోన్ ద్వారా రికార్డ్ చేసి, సోషల్ మీడియాలో అప్‌లోడ్ చేస్తూ పైరసీకి పాల్పడుతున్నట్టు గుర్తించారు. ఇప్పటివరకు సుమారు 65 సినిమాలను పైరసీ చేసినట్టు అధికారులు వెల్లడించారు.
'గేమ్ ఛేంజర్, కన్నప్ప' వంటి చిత్రాలపై పైరసీ ప్రభావంతో నిర్మాతలు తీవ్ర నష్టాలను చవిచూశారు. ఈ నేపథ్యంలో రంగంలోకి దిగిన పోలీసులు, ప్రత్యేక దర్యాప్తుతో కిరణ్‌ను పట్టుకున్నారు. ఇతని ఇంటి వద్ద నుంచి పలు ఆధారాలను స్వాధీనం చేసుకున్నారు. పైరసీ నెట్‌వర్క్ వెనుక మరింత మంది ఉన్నారని భావించిన పోలీసులు ఆ దిశగా విచారణ కొనసాగిస్తున్నారు.
ఇక నిర్మాత దిల్ రాజు కూడా తాజా ఘటనలపై స్పందించారు. 'ఒక సినిమాను 400 నుంచి 1000 డాలర్లకు విక్రయిస్తున్న ముఠాలు పరిశ్రమకు గొడ్డలిపెట్టు' అని వ్యాఖ్యానించారు. టాలీవుడ్‌కు గండంగా మారుతున్న పైరసీపై చట్టపరమైన కఠిన చర్యలు అవసరమని సినీ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.