స్టంట్‌మ్యాన్ మృతిపై స్పందించిన పా.రంజిత్
తమిళ స్టార్ ఆర్య హీరోగా, పా. రంజిత్ దర్శకత్వంలో రూపొందుతోన్న యాక్షన్ మూవీ ‘వేట్టువం’ షూటింగ్ సమయంలో విషాదకర ఘటన చోటుచేసుకుంది.;
తమిళ స్టార్ ఆర్య హీరోగా, పా. రంజిత్ దర్శకత్వంలో రూపొందుతోన్న యాక్షన్ మూవీ ‘వేట్టువం’ షూటింగ్ సమయంలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. నాగపట్నం సమీపంలో కారుతో స్టంట్ చేస్తుండగా 52ఏళ్ల స్టంట్ ఆర్టిస్ట్ మోహన్ రాజు గుండెపోటుకు గురై ఆసుపత్రికి తరలించేలోపే మరణించారు. ఈ వార్త చిత్రబృందాన్ని తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది.
ఈ నేపథ్యంలో దర్శకుడు పా. రంజిత్, ఆయన నిర్మాణ సంస్థ నీలం ప్రొడక్షన్స్ సోషల్ మీడియా ద్వారా సంతాపం వ్యక్తం చేశారు. 'జులై 13న మేము ఎంతో ప్రతిభావంతుడైన మోహన్ రాజును కోల్పోయాం. ఆయన్ను మేము కుటుంబసభ్యుల్లా భావించేవాళ్లం. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా ఇలా జరుగుతుందని ఎవరూ ఊహించలేదు. ఇది మాకు పెద్ద షాక్' అని పేర్కొన్నారు.
మోహన్ రాజు పట్ల చిత్రబృందం గౌరవంతో పాటు అపారమైన ప్రేమను కలిగి ఉందని, ఆయన ప్లానింగ్, స్టంట్స్ అమలులో అసమాన నైపుణ్యం ఉన్నవారని రంజిత్ గుర్తుచేశారు. మోహన్ రాజు కుటుంబానికి, సన్నిహితులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.