హరిహరుడికి పోటీ ఇస్తున్న నరసింహుడు
ప్రహ్లాదుడి భక్తి, నృసింహుడి తేజం – స్క్రీన్‌పై వెలిగిన పురాణ కథ - భాష కాదు కథే ముఖ్యం – మరోసారి నిరూపించిన తెలుగు ప్రేక్షకులు;
జూలై 25న థియేటర్లలోకి వచ్చిన యానిమేటెడ్ చిత్రం ‘మహావతార నరసింహా’ ప్రేక్షకుల్ని ఆకర్షిస్తోంది. ‘సలార్’, ‘కేజీఎఫ్’ వంటి భారీ పాన్ ఇండియా చిత్రాలను నిర్మించిన హోంబలే ఫిల్మ్స్ ఈ చిత్రాన్ని రూపొందించింది. శ్రీ మహావిష్ణువు తీసుకున్న నృసింహ అవతారానికి సంబంధించిన ఇతిహాసాన్ని ఆధారంగా తీసుకుని ఈ సినిమాను తెరకెక్కించారు.
ఈ మూవీ కథ అందరికీ తెలిసిన ప్రహ్లాదుడి జీవితంపై ఆధారపడింది. హిరణ్యకశ్యపుడు బ్రహ్మదేవుని నుండి వరం పొందడం, ఆ వరంతో ముల్లోకాలను గందరగోళపెట్టడం, ప్రహ్లాదుడు విష్ణుభక్తుడిగా మారడం, ఆ భక్తిని తట్టుకోలేక హిరణ్యకశ్యపుడు చేసిన ప్రయత్నాలు, చివరికి నృసింహావతారంగా విష్ణువు అవతరించి అతనిని సంహరించడం లాంటి అంశాలు సినిమాకు ప్రాణం.
యానిమేషన్ టెక్నాలజీలో రూపొందిన ఈ చిత్రం గొప్ప విజువల్ అనుభూతిని కలిగిస్తోంది. పాత్రలు బొమ్మలుగా ఉన్నప్పటికీ, అందులో చూపిన భావోద్వేగాలు, యాక్షన్ సన్నివేశాలు, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అన్నీ ప్రేక్షకులను అలరిస్తున్నాయి. భారతీయ టెక్నాలజీతో తయారైన ఈ యానిమేటెడ్ చిత్రం ఎమోషనల్‌గా అందరినీ తాకుతోంది.
ఈ చిత్రం థియేటర్లలో పెద్దగా ప్రచారం లేకుండా విడుదలైనప్పటికీ, జూలై 25 నుంచి బుక్‌మైషోలో గంటకు 5–6 వేల టికెట్లు అమ్ముడవుతున్నాయి. అదే సమయంలో పవన్ కళ్యాణ్ నటించిన ‘హరిహర వీరమల్లు’ చిత్రానికి మిక్స్డ్ టాక్ రావడంతో, ప్రేక్షకులు ఈ యానిమేటెడ్ చిత్రానికి మొగ్గు చూపుతున్నారు. ఫ్యామిలీ ఆడియెన్స్‌కి ఇది మొదటి ఎంపికగా మారే అవకాశం కనిపిస్తుంది.
ఈ సినిమాకు మొదటి రోజే మంచి టాక్ వచ్చిందని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. విమర్శకులు కూడా సినిమా గురించి మంచి అభిప్రాయాలు చెబుతున్నారు. ముఖ్యంగా టికెట్ల ధర తక్కువగా ఉండడం (మల్టీప్లెక్సుల్లో ₹150కే) వల్ల, కుటుంబ సమేతంగా చూసేందుకు తక్కువ ఖర్చుతో అవకాశం కలుగుతోంది.
‘హరిహర వీరమల్లు’ చిత్రాన్ని చారిత్రక నేపథ్యంలో రూపొందించిన కల్పిత కథగా చూస్తే, ‘మహావతార నరసింహా’ మాత్రం భక్తి, విశ్వాసం, ధర్మంపై రూపొందిన శాశ్వత ఇతిహాసం. పిల్లలకు, యువతకి భగవత్ అవతారాల గురించి తెలిసేందుకు ఇది మంచి ప్రయత్నం. అందుకే ఈ సినిమా ఊహించని విజయాన్ని అందుకుంటోంది.
ఈ సినిమాకి ‘పుష్ప 2’కి బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ఇచ్చిన సామ్ C.S సంగీతం అందించగా, 2024లో గోవాలో జరిగిన ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియాలో (IFFI) ప్రదర్శించబడింది. 2Dతో పాటు 3D వెర్షన్‌లో కూడా ఈ సినిమా అందుబాటులో ఉంది.
ఈ సినిమాకు వస్తున్న అనూహ్య స్పందనతో థియేటర్లు షోలను పెంచుతున్నాయి. పౌరాణిక సినిమాలను ప్రేమించే వారికి ఇది మంచి అవకాశం. యానిమేషన్ ఫార్మాట్‌లో వచ్చినా, కథన శైలి, భావోద్వేగాలు, విజువల్స్ వల్ల ఈ సినిమా ప్రేక్షకుల మనసు దోచుకుంటోంది.
రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు భాషతో సంబంధం లేకుండా ప్రాంతీయ భావం చూపకుండా వినోదాన్ని పంచే ఏ భాష చిత్రాన్ని అయినా ఆదరిస్తారు అని మరొకసారి నిరూపితం అయింది.హరిహర వీరమల్లు లాంటి ఒక హిస్టారికల్ పాన్ ఇండియా మూవీ మంచి కలెక్షన్స్ తో ఉన్నా, ఒక కన్నడ చిత్రాన్ని కూడా అంతగా ఆదరించడం తెలుగు ప్రజలకు సినిమా మీద ఎంత మక్కువో తెలుస్తుంది.కానీ ఇటీవల జరిగిన సంఘటన ఇందుకు భిన్నంగా ఉంది,ప్రతిష్టాత్మక "హరిహర వీరమల్లు" లాంటి మూవీ బ్యానల్ర్ని ప్రాంతీయ బేధంతో కర్ణాటకలో కన్నడిగులు తొలగించటం అనేది చాలా విచారకరమైన సంఘటన.అదే కన్నడిగుల చిత్రాన్ని మన తెలుగు ప్రజలు ఆదరించటం వారి ఔన్నత్యనికి నిదర్శనం.