పృథ్వీరాజ్ సుకుమారన్ ‘విలాయత్ బుద్ధ’ షూటింగ్ పూర్తి
పృథ్వీరాజ్ సుకుమారన్ ‘విలాయత్ బుద్ధ’ షూటింగ్ పూర్తి
మలయాళ యంగ్ సూపర్ స్టార్ పృథ్వీరాజ్ సుకుమారన్ తన తాజా చిత్రం ‘విలాయత్ బుద్ధ’ షూటింగ్‌లో తన భాగాన్ని పూర్తి చేశాడు. ఈ విషయాన్ని ఆయన సోషల్ మీడియాలో ప్రకటిస్తూ.. తన పాత్ర డబుల్ మోహనన్ లుక్‌లో ఒక ఫోటోను షేర్ చేశాడు. “2 సంవత్సరాల పాటు షూటింగ్ జరిగిన ‘విలాయత్ బుద్ధ’ లో నా పాత్రకు ఆఖరి క్లాప్ పడింది. ఇది ఎన్నో విధాలుగా ఓ ప్రయాణం అయింది.” అంటూ తన అనుభవాన్ని వెల్లడించాడు. అయితే, ఇది మొత్తం చిత్రానికి ఫైనల్ షెడ్యూల్ ముగిసిందా అనే విషయంలో ఇంకా స్పష్టత లేదు.
జయన్ నంబియార్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా.. ప్రముఖ రచయిత జీ.ఆర్. ఇందుగోపన్ రాసిన ‘విలాయత్ బుద్ధ’ నవల ఆధారంగా రూపొందుతోంది. చిత్రానికి ఇందుగోపన్, రాజేశ్ పిన్నాడన్ కలిసి స్క్రీన్‌ప్లే అందించారు. కథ ప్రధానంగా ఓ తెలుపు గంధపు చెట్టు హక్కులపై ఓ వృద్ధుడు భాస్కరన్ మాస్టర్ (షమ్మీ తిలకన్), అతని శిష్యుడు డబుల్ మోహనన్ (ప్రథ్వీరాజ్) మధ్య జరిగే ఘర్షణ చుట్టూ ఈ సినిమా కథ నడుస్తుంది.
2020లో లాంచయిన ఈ ప్రాజెక్ట్.. 2022 అక్టోబరులో షూటింగ్ మొదలుపెట్టింది. అయితే.. అనేక అడ్డంకులతో పాటు 2023లో పృథ్వీరాజ్ షూటింగ్ సమయంలో గాయపడటం వలన వాయిదా పడింది. మారయూర్‌లో ఓ భారీ యాక్షన్ సీక్వెన్స్ చిత్రీకరణలో పృథ్వీరాజ్ తన మోకాలి గాయంతో ఆసుపత్రిపాలయ్యాడు. శస్త్రచికిత్స అనంతరం మూడునెలలపాటు విశ్రాంతి తీసుకోవాల్సి వచ్చింది.
చిత్రంలో అనూ మోహన్, ప్రియమ్ వద కృష్ణన్, కొట్టాయం రమేష్, తీజే అరుణ్‌సాలం ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. టెక్నికల్ విభాగంలో కాంతారా సినిమాకు పని చేసిన అర్వింద్ కశ్యప్ సినిమాటోగ్రఫీ అందించగా, జేక్స్ బిజోయ్ సంగీతం అందిస్తున్నారు. ఇంతలో.. పృథ్వీరాజ్ తన మూడో దర్శకత్వ ప్రాజెక్ట్ ‘L2: ఎంపురాన్’ పై దృష్టి పెట్టాడు. 2019లో వచ్చిన మోహన్‌లాల్ బ్లాక్‌బస్టర్ లూసిఫర్ కు ఇది సీక్వెల్‌గా రూపొందుతోంది. ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా మార్చి 27న విడుదల కానుంది.