14 ఏళ్ళ తర్వాత మళ్ళీ మోహన్ లాల్, దిలీప్ !

Update: 2025-03-08 03:02 GMT

మాలీవుడ్ జననాయకుడు దిలీప్ ప్రధాన పాత్రలో, నూతన దర్శకుడు ధనంజయ్ శంకర్ దర్శకత్వం వహిస్తున్న ‘భభబ’ (భయం, భక్తి, బహుమానం) చిత్రంలో మోహన్‌లాల్ కనిపించనున్నారు. ఈ విషయాన్ని దర్శకుడు ధనంజయ్ శంకర్ తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో మోహన్‌లాల్ కొత్త లుక్‌ను షేర్ చేస్తూ వెల్లడించారు. ఈ అప్‌డేట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కొంత విరామం తర్వాత సినిమా షూటింగ్ తిరిగి ప్రారంభమవుతున్నట్టు దర్శకుడి ఇన్‌స్టాగ్రామ్ స్టోరీ సూచిస్తోంది. ఈ నేపథ్యంలో మోహన్‌లాల్ ఈ చిత్రంలో అతిథి పాత్రలో కనిపిస్తారని ఊహాగానాలు ఊపందుకున్నాయి. 2011 లో వచ్చిన క్రిష్టియన్ బ్రదర్స్ తర్వాత.. అంటే దాదాపు 14 ఏళ్ళ తర్వాత మళ్ళీ మోహన్ లాల్ , దిలీప్ స్ర్కీన్ షేర్ చేసుకోనుండడం విశేషం.

శ్రీగోకులం మూవీస్ బ్యానర్‌పై రూపొందుతున్న ఈ చిత్రంలో దిలీప్‌తో పాటు వినీత్ శ్రీనివాసన్, ధ్యాన్ శ్రీనివాసన్ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. సినిమా పూర్తిస్థాయిలో మాస్-కామెడీ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతోంది. ఈ చిత్రంలో దిలీప్ తన అభిమానులను ఆకట్టుకునే వింటేజ్ లుక్‌లో కనిపించనున్నాడు. ప్రస్తుతం కోయంబత్తూర్, పాలక్కాడ్, పొల్లాచి ప్రాంతాల్లో చిత్రీకరణ జరుపుకుంటోంది. భారీ బడ్జెట్‌తో నిర్మితమవుతున్న ఈ చిత్రానికి కథను నూరిన్ షరీఫ్, ఫాహిం సఫర్ కలిసి అందిస్తున్నారు.

ఈ చిత్రంలో ప్రముఖ కొరియోగ్రాఫర్, నటుడు సాండీ మాస్టర్, తమిళ హాస్య నటుడు రెడ్డిన్ కింగ్స్‌లీ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. అలాగే బాలు వర్గీస్, బైజు సంతోష్, సిద్ధార్థ్ భరతన్, శరణ్య పొన్వర్ణన్ తదితరులు నటిస్తున్నారు. సినిమాను గోకులం గోపాలన్ నిర్మిస్తున్నారు. పాటలు కైతప్రం, వినాయక్ శశికుమార్, మను మంజిత్ రాయగా, సంగీతం షాన్ రహ్మాన్ అందిస్తున్నారు. ‘భభబ’ చిత్రం మాస్ ఆడియెన్స్‌ను ఆకట్టుకునే అన్ని హంగులతో రూపొందుతుండటం విశేషం.

Tags:    

Similar News