గల్ఫ్ లో నిషేధించిన మలయాళ చిత్రం !
LGBTQ అంశాలకు సంబంధించిన సూచనలు ఉన్న కారణంగా ఈ చిత్రాన్ని జీసీసీ దేశాలన్నిటిలో నిషేధించారు.;
వినీత్ శ్రీనివాసన్ ప్రధాన పాత్రలో నటించిన తాజా చిత్రం ‘ఒరు జాతి జాతకం’. ఈ మూవీ అనుకున్న ప్రకారం జనవరి 31న విడుదల కావాల్సి ఉండగా.. అనూహ్యంగా గల్ఫ్ దేశాల్లో విడుదలకు అడ్డంకులు ఎదురయ్యాయి. LGBTQ అంశాలకు సంబంధించిన సూచనలు ఉన్న కారణంగా ఈ చిత్రాన్ని జీసీసీ దేశాలన్నిటిలో నిషేధించారు. అయితే ఒమన్ మాత్రం దీనికి మినహాయింపుగా నిలిచింది.
నిజానికి ఈ చిత్రం ముందుగా 2024 ఆగస్టు 22న విడుదల కావాల్సి ఉండగా.. విడుదల వాయిదా పడింది. కానీ ఇప్పుడు విడుదలకు మరోసారి ఆటంకం ఏర్పడింది. ఈ సినిమాతో వినీత్ శ్రీనివాసన్, దర్శకుడు ఎం. మోహనన్, సహ నాయిక నిఖిల విమల్ కలిసి రెండోసారి పనిచేస్తున్నారు. ఈ కాంబినేషన్ గతంలో ‘అరవిందంటే అతిధికల్’ అనే విజయవంతమైన చిత్రాన్ని అందించింది.
‘ఒరు జాతి జాతకం’ కథనం ఉత్తర మలబార్ నేపథ్యంలో సాగుతుంది. ఇందులో జయేష్ అనే వ్యక్తి జీవితంలో ఓ పెనుమార్పును తెచ్చే సంఘటనలు ఎలాంటి పరిస్థితులకు దారి తీస్తాయి అనే అంశం కథకు కేంద్ర బిందువుగా ఉంటుంది. జయేష్ ఓ జ్యోతిష్య నిపుణురాలిని కలుసుకున్న తర్వాత.. అతడి జీవితం అనుకోని మలుపులు తిరుగుతుంది. లోతైన సమస్యల్లో చిక్కుకుని, ఓ చీకటి దశలోకి వెళ్లిపోతాడు జయేష్. ఈ పరిస్థితుల్లో అతను తిరిగి విజయాన్ని ఎలా సాధిస్తాడు? అన్నది సినిమా ప్రధాన ఇతివృత్తం.
ఈ చిత్రంలో బాబు ఆంటోని, పి.పి. కుంహికృష్ణన్, మృదుల్ నాయర్, విదు ప్రతాప్, సయనోరా ఫిలిప్, అమల్ తాహ, ఇందు తంపి, కయాదు లోహార్ వంటి ప్రఖ్యాత నటీనటులు ముఖ్య పాత్రల్లో నటించారు.
వినీత్ శ్రీనివాసన్ దర్శకత్వంలో గతంలో వచ్చిన ‘వర్షంగళ్ కు శేషం’ సినిమా ప్రణవ్ మోహన్‌లాల్, ధ్యాన్ శ్రీనివాసన్ ప్రధాన పాత్రల్లో నటించిన పీరియడ్ కామెడీ-డ్రామాగా ప్రేక్షకుల ప్రశంసలు అందుకుంది. ప్రస్తుతం వినీత్ శ్రీనివాసన్ దిలీప్ తో కలిసి ‘భ.భ.బా.’ అనే యాక్షన్-థ్రిల్లర్లో నటిస్తున్నాడు. ఈ సినిమాకు ధనంజయ్ శంకర్ దర్శకత్వం వహిస్తున్నారు.