‘జైలర్ 2’ లో టాలెంటెడ్ మలయాళ బ్యూటీ !

"సూపర్ స్టార్ రజనీకాంత్ సార్‌ను కలిసిన ఆ క్షణం నాకు జీవితంలో ఓ గొప్ప సంతృప్తిని ఇచ్చింది. 'జైలర్ 2'లో ఆయనతో కలిసి పనిచేసే అదృష్టం నాకు లభించిందని భావిస్తున్నాను" అంటూ ఆనందం వ్యక్తం చేసింది.;

By :  K R K
Update: 2025-05-17 04:04 GMT

'అంగమాలీ డైరీస్' చిత్రంతో తన నటనా ప్రతిభను చాటుకున్న మలయాళ నటి అన్నా రాజన్.. ఇప్పుడు పెద్ద బడ్జెట్ తమిళ చిత్రం 'జైలర్ 2' ద్వారా కోలీవుడ్‌లోకి అడుగుపెడుతోంది. ఇదే ఆమె డెబ్యూ తమిళ చిత్రం కావడం విశేషం. సూపర్ స్టార్ రజనీకాంత్ తో కలిసి నటించే అవకాశం వచ్చిన సందర్భంలో తన ఆనందాన్ని సోషల్ మీడియా వేదికగా అన్నా పంచుకుంది. "సూపర్ స్టార్ రజనీకాంత్ సార్‌ను కలిసిన ఆ క్షణం నాకు జీవితంలో ఓ గొప్ప సంతృప్తిని ఇచ్చింది. 'జైలర్ 2'లో ఆయనతో కలిసి పనిచేసే అదృష్టం నాకు లభించిందని భావిస్తున్నాను" అంటూ ఆనందం వ్యక్తం చేసింది.

ప్రస్తుతం 'జైలర్ 2' చిత్రీకరణ కేరళలోని కోళికోడ్ లో జరుగుతోంది. ఇంతకు ముందు... పాలక్కాడు, శోలాయూరు గొంజియూర్, అనక్కట్టి ప్రాంతాల్లో దాదాపు 20 రోజుల పాటు చిత్రీకరణ జరిపారు. 2023లో వచ్చిన సూపర్ హిట్ చిత్రం 'జైలర్'కు ఇది సీక్వెల్ అన్న సంగతి తెలిసిందే. నెల్సన్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రంలో రజనీకాంత్ తన మళ్లీ ట్రేడ్ మార్క్ యాక్టింగ్ తో .. ‘టైగర్’ ముత్తువేల్ పాండియన్ పాత్రను పోషిస్తున్నారు. అలాగే మొదటి భాగంలో ఆయన భార్య పాత్రలో కనిపించిన రమ్యకృష్ణ కూడా ఈ సీక్వెల్‌లో కొనసాగుతోంది.

మొదటి భాగంలో మెరిసిన శివరాజ్ కుమార్, మోహన్‌లాల్, జాకీ ష్రాఫ్ వంటి ప్రముఖుల రీ-ఎంట్రీపై ఇప్పటివరకు అధికారిక సమాచారం లేదు కానీ, వీరి పాత్రలు కొనసాగే అవకాశం ఉందనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అంతేకాదు, నటసింహం నందమూరి బాలకృష్ణ, మలయాళ నటుడు సురాజ్ వెంజారమూడ్ లాంటి ఇతర ప్రముఖులు కూడా 'జైలర్ 2'లో భాగమవుతారని సినీ వర్గాల్లో చర్చ నడుస్తోంది. ఈ చిత్రాన్ని కళానిధి మారన్ సన్ పిక్చర్స్ పతాకంపై నిర్మిస్తున్నారు. సంగీతం అనిరుధ్ రవిచంద్రన్ అందించనున్నారు. సినిమాటోగ్రఫీకి విజయ్ కార్తిక్ కన్నన్, ఎడిటింగ్‌కు ఆర్ నిర్మల్ బాధ్యతలు చేపట్టనున్నారు.

Tags:    

Similar News