వివాదంలో మోహన్‌లాల్ సినిమా!
మలయాళీ సూపర్ స్టార్ మోహన్‌లాల్ నటించిన ‘ఎల్2: ఎంపురాన్’ సినిమా కొన్ని సన్నివేశాల కారణంగా వివాదంలో చిక్కుకుంది.;
మలయాళీ సూపర్ స్టార్ మోహన్‌లాల్ నటించిన ‘ఎల్2: ఎంపురాన్’ సినిమా కొన్ని సన్నివేశాల కారణంగా వివాదంలో చిక్కుకుంది.చిత్రంలో 2002 గుజరాత్ అల్లర్లను పోలి ఉన్న దృశ్యాలు ఓ వర్గాన్ని తక్కువగా చూపుతున్నాయనే అభ్యంతరాలు వెల్లువెత్తుతున్నాయి.
ఈ నేపథ్యంలో, నిర్మాత గోకులం గోపాలన్ దర్శకుడు పృథ్వీరాజ్ సుకుమారన్‌తో చర్చలు జరిపి, వివాదాస్పద సన్నివేశాలను తొలగించే సన్నాహాల్లో ఉన్నారట. ఇప్పటికే కొన్ని పదాలను మ్యూట్ చేసినప్పటికీ, మరికొన్ని మార్పుల అవసరం ఉందని భావించిన టీమ్ ఆ దిశగా కసరత్తులు చేస్తుందట.
సినిమా సెన్సార్ అనుమతి పొందినప్పటికీ, విడుదల తర్వాత మార్పులు చేయాల్సి వస్తే భారీ ఖర్చు అవుతుందని, 4000 థియేటర్లలో ప్రదర్శితమవుతున్న ఈ చిత్రానికి సుమారు రూ.40 లక్షలు అవసరమవుతాయని నిర్మాత అంచనా వేస్తున్నారు. సినిమా వినోదం కోసం రూపొందించేదే కానీ, ఎవరినీ బాధ పెట్టే ఉద్దేశం ఉండదని నిర్మాత గోకులం గోపాలన్ స్పష్టం చేశారు. మరోవైపు విడుదలైన రెండు రోజులకే వరల్డ్ వైడ్ గా రూ.100 కోట్లు గ్రాస్ వసూళ్లను సాధించింది ‘ఎంపురాన్‘.