'మంజుమ్మల్ బాయ్స్' నిర్మాత, నటుడు అరెస్ట్

Update: 2025-07-09 05:30 GMT

'మంజుమ్మల్ బాయ్స్' నిర్మాత, నటుడు అరెస్ట్

మలయాళం యాక్టర్, నిర్మాత సౌబిన్ షాహీర్ భారీ ఆర్థిక కుంభకోణం కేసులో అరెస్టయ్యారు. ఈ అరెస్ట్ 'మంజుమ్మెల్ బాయ్స్' సినిమాతో పాటు, దాని బాక్సాఫీస్ ఆదాయాలతో సంబంధం ఉన్నదిగా పోలీసులు పేర్కొన్నారు. సౌబిన్‌తో పాటు ఆయన తండ్రి బాబు షాహీర్, ఆయన సహచరుడు షాన్ ఆంటనీల్ని పోలీసులు ముందు విచారణకు పిలిపించారు. బాబు షాహీర్, షాన్ ఆంటనీ అరెస్టులు అధికారికంగా నమోదు చేయబోతున్నట్టు సమాచారం. అయితే హైకోర్టు ఈ ముగ్గురికీ అరెస్టు‌కు ముందుగా బెయిల్ పొందే అవకాశం ఇచ్చినందున, పోలీస్ స్టేషన్లోనే వీరిని బెయిల్‌పై విడుదల చేయనున్నారు.

సౌబిన్ షాహీర్‌కు చెందిన పరవ ఫిల్మ్స్ అనే నిర్మాణ సంస్థ 'మంజుమ్మెల్ బాయ్స్' చిత్రాన్ని నిర్మించగా, ఇప్పుడు ఆ సంస్థపై ఆర్థిక మోసాల ఆరోపణలతో దర్యాప్తు జరిపిస్తున్నారు. ఆలప్పుళ కు చెందిన సిరాజ్ వళియవీట్టిల్ అనే వ్యక్తి ఈ సినిమాకు సంబంధించి తీవ్ర ఆరోపణలు చేశారు. తాను ఈ సినిమాకు రూ. 7 కోట్లు పెట్టుబడి పెట్టానని, సినిమా మొత్తం బడ్జెట్ రూ. 22 కోట్లు అని చెప్పినందుననే పెట్టుబడి పెట్టానని ఆయన వాదించారు. కానీ తర్వాత సినిమాకు ఖర్చయిన మొత్తం బడ్జెట్ కేవలం రూ. 18.65 కోట్లు మాత్రమేనని తెలిసిందని చెప్పారు. అంతేకాకుండా, ఒప్పందం ప్రకారం తాను పొందాల్సిన లాభాల్లో 40 శాతం వాటా ఇప్పటికీ అందలేదని ఆయన ఆరోపించారు.

ఈ ఫిర్యాదు ఆధారంగా పోలీసులు విచారణ ప్రారంభించి, సౌబిన్ సహా ఇతరులపై హైకోర్టుకు నివేదిక సమర్పించారు. ఈ కేసులో నిందితులు సిరాజ్‌ను మోసం చేసేందుకు పథకం వేసి, తప్పుదారి పట్టించారని పోలీసుల నివేదిక పేర్కొంది. గత సంవత్సరం సౌబిన్ షాహీర్, పరవ ఫిల్మ్స్, డ్రీం బిగ్ ఫిల్మ్స్, నిర్మాత షాన్ ఆంటనీ ఆఫీసులపై ఆదాయపు పన్ను శాఖ సోదాలు కూడా నిర్వహించింది.

ఈ సోదాల్లో సౌబిన్ షాహీర్ పన్ను దాఖలాలు చేయకపోవడం, ముఖ్యమైన ఆర్థిక పత్రాలు దాచి ఉంచడం వంటి విషయాలపై ఆరోపణలు వచ్చాయి. మంజుమ్మెల్ బాయ్స్ సినిమా మలయాళ సినీ పరిశ్రమలోనే అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రాల్లో ఒకటిగా నిలిచింది. రూ. 200 కోట్ల మార్కును దాటిన తొలి మలయాళ చిత్రంగా ఈ సినిమా గుర్తింపు పొందింది. కేరళతో పాటు తమిళనాడులో ఈ సినిమాకు విశేష ఆదరణ లభించింది.

Tags:    

Similar News