'రొ్లెక్స్' గురించి అప్డేట్ ఇచ్చిన లోకేష్ కనగరాజ్‌

Update: 2025-05-03 06:23 GMT

తనదైన స్టైల్ తో తమిళ చిత్ర పరిశ్రమలో ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్న యువ దర్శకుడు లోకేష్ కనగరాజ్. ‘ఖైదీ’, ‘మాస్టర్’, ‘విక్రం’, ‘లియో’ వంటి చిత్రాలతో వరుస విజయాల బాటలో దూసుకుపోతున్న లోకేష్, ఇప్పుడు ఒక మైల్‌స్టోన్ ప్రాజెక్ట్‌పై శ్రద్ధ పెడుతున్నాడు. అదే సూపర్‌స్టార్ రజనీకాంత్‌తో రూపొందిస్తున్న ‘కూలీ’.

ఈ చిత్రాన్ని సన్ పిక్చర్స్ అధినేత కళానిధి మారన్ నిర్మిస్తున్నారు. ఇటీవల విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్‌కి విశేష స్పందన రావడంతో సినిమాపై అంచనాలు మిన్నంటుతున్నాయి. గోల్డ్ స్మగ్లింగ్ నేపథ్యం నేపథ్యంలో రూపొందుతున్న ఈ యాక్షన్ థ్రిల్లర్‌లో నాగార్జున, ఉపేంద్ర, శృతి హాసన్, సత్యరాజ్, రెబా మోనికా జాన్ వంటి నటులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు.

లోకేష్ – రజనీ కాంబినేషన్‌లో వస్తున్న ఈ ప్రాజెక్ట్‌పై తమిళతో పాటు ఇతర భాషలలో కూడా భారీ ఆసక్తి నెలకొంది. కమల్ హాసన్‌తో చేసిన ‘విక్రం’ భారీ హిట్ అయ్యింది కాబట్టి, ఇప్పుడు రజనీకాంత్‌తో చేస్తున్న ‘కూలీ’ ఇంకొంత గొప్ప విజయం సాధిస్తుందని సినీ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

ప్రస్తుతం ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉంది. ఆగస్టు 14న గ్రాండ్ రిలీజ్‌కు సన్నాహాలు జరుగుతున్నాయి. రజనీకాంత్‌తో మొదటిసారి సినిమా చేయడం వల్ల, లోకేష్ ఈ ప్రాజెక్ట్‌ను చాలా జాగ్రత్తగా తీర్చిదిద్దుతున్నాడు. సోషల్ మీడియా దూరంగా ఉండి పూర్తిగా సినిమాపై ఫోకస్ చేస్తున్నాడు.

ఇక ఇటీవల ఓ మీడియా ఇంటర్వ్యూలో లోకేష్ కనగరాజ్, అభిమానులు ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్న ‘రోలెక్స్’ సినిమా గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. హీరో సూర్యపై ఓ ప్రశ్నకు స్పందిస్తూ...

"ఖచ్చితంగా 'రోలెక్స్' సినిమా ఉంటుంది. కానీ అది ఎప్పుడు వస్తుందో ఇప్పుడే చెప్పలేను. సూర్య సర్‌కు కొన్నిసినిమాలపై కమిట్‌మెంట్‌లు ఉన్నాయి. నేనూ ‘ఖైదీ 2’ మొదలుపెట్టాలి. ఇద్దరం మా ప్రాజెక్ట్స్ పూర్తిచేసిన తర్వాత 'రోలెక్స్'ను మొదలుపెడతాం. అయితే సినిమా మాత్రం వదిలిపెట్టే ప్రశ్నే లేదు" అని తెలిపారు.

ఈ మాటలతో ‘రోలెక్స్’ ప్రాజెక్ట్‌పై అభిమానుల్లో కొత్త ఉత్సాహం పెరిగింది. ఒకవేళ ఈ ప్రాజెక్ట్ కార్యరూపం దాలిస్తే, లోకేష్ సినిమాటిక్ యూనివర్స్ మరింత విస్తరించి, తమిళ సినిమాకే కాదు, భారతీయ చిత్రసీమకు ఓ కొత్త దిశ చూపే అవకాశం ఉంది.

Tags:    

Similar News