‘కాళిదాస్ 2’ తమిళ చిత్రం ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల
‘కాళిదాస్ 2’ తమిళ చిత్రం ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల2019 లో విడుదలైన ‘కాలిదాస్’ చిత్రంలో పోలీస్ ఆఫీసర్ పాత్రలో భరత్ నటించిన విషయం తెలిసిందే. ఇప్పుడు.. అదే పాత్రలో ఆయన మరోసారి కనిపించబోతున్నారు. రచయిత-దర్శకుడు శ్రీ సెంథిల్ మళ్లీ దర్శకత్వం వహిస్తుండగా.. క్రైమ్ అండ్ పనిష్మెంట్ అనే ట్యాగ్‌లైన్‌తో ఈ చిత్రం రూపుదిద్దుకుంటోంది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతుండగా తాజాగా ఈ సినిమా ఫస్ట్‌లుక్ పోస్టర్ విడుదలైంది.
దర్శకుడు శ్రీ సెంథిల్ మాట్లాడుతూ, ‘కాళిదాస్ 2’ అనిపించుకున్నప్పటికీ ఇది ఒక స్టాండెలోన్ స్టోరీ అని తెలిపారు. “ఇన్‌స్పెక్టర్ కాళిదాస్ ఈసారి పూర్తిగా భిన్నమైన కేసును చేధించబోతున్నాడు. క్రైమ్ థ్రిల్లర్ కథనంతో పోలీస్ ఆఫీసర్ పాత్రను మళ్లీ తెరపై చూపించాలనుకున్నాను. కొత్త పాత్ర సృష్టించకుండా, ఉన్న కాళిదాస్ పాత్రనే తిరిగి తీసుకురావడం అనువుగా అనిపించింది,” అని చెప్పారు.
2019 లో విడుదలైన ‘కాళిదాస్’ సినిమా ‘బ్లూ వేల్’ ఛాలెంజ్ ఆధారంగా అనేక మరణాల చుట్టూ తిరుగుతూ.. ప్రధాన పాత్ర వ్యక్తిగత జీవితాన్ని లోతుగా పరిశీలిస్తుంది. అయితే, ‘కాళిదాస్ 2’ పూర్తిగా కొత్త కోణంలో సాగనుంది. “ఇది రొటీన్ థ్రిల్లర్ మాదిరి కాకుండా, ప్రొసీజురల్ థ్రిల్లర్ మాదిరిగా ఉంటుంది. ఇందులో రెండు సమాంతర కథలు నడుస్తాయి. అజయ్ కార్తి నెగటివ్ షేడ్స్ ఉన్న క్యారెక్టర్ పోషిస్తున్నాడు. గత చిత్రంతో పోలిస్తే, ‘కాళిదాస్ 2’లో స్కేల్ పెద్దదిగా ఉంది. మరింత యాక్షన్, గంభీరత, భారీ తారాగణం ఇందులో ఉంటాయి,” అని శ్రీ సెంథిల్ వివరించారు. ఈ సినిమాలో ప్రముఖ మలయాళ నటి సంగీత కీలక పాత్రలో నటిస్తున్నారు.
స్కై పిక్చర్స్ బ్యానర్‌పై కె. సెంథిల్, ఎన్. యోగేశ్వరన్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ‘కాళిదాస్ 2’ చిత్రీకరణ ఎక్కువగా చెన్నైలో.. కొంత భాగం కేరళలో పూర్తయింది. ప్రకాష్ రాజ్, కిషోర్ ముఖ్య పాత్రల్లో నటించగా, సురేశ్ మీనన్, భవాని శ్రీ, అనంత్ నాగ్, రాజా రవీంద్ర, డీఎం కార్తిక్, అబర్నతి ఇతర కీలక పాత్రలు పోషిస్తున్నారు. సాంకేతిక విషయాల్లో, సంగీతాన్ని సామ్ సిఎస్ అందించగా, ఛాయాగ్రహణం సురేశ్ బాలా, ఎడిటింగ్ భువన్ శ్రీనివాసన్, యాక్షన్ సీక్వెన్స్‌లను ఓం ప్రకాష్ నిర్వహించారు. ఈ చిత్రాన్ని మే నెలాఖరులో విడుదల చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.