ఇళయరాజా ‘వేలియంట్’ ... లండన్‌లో సంగీత మాంత్రికుడు

Update: 2025-03-09 12:16 GMT

దక్షిణాది సినీ సంగీత ప్రపంచానికి రారాజు, మాస్ట్రో ఇళయరాజా తన మొదటి పశ్చిమ శాస్త్రీయ సింఫనీ ‘వేలియంట్’ను మార్చి 9 అర్ధరాత్రి లండన్‌లోని ఈవెంటిమ్ అపోలో థియేటర్‌లో ఆవిష్కరించారు. ఈ మహత్తర ఘట్టంలో ఆయనకు రాయల్ ఫిలార్మోనిక్ ఆర్కెస్ట్రా సహకరించింది. ఈ అద్భుతమైన సంగీత క్షణాలను వీక్షించిన అభిమానులు, ఇళయరాజాకు అభినందనలు తెలియజేశారు. ఇళయరాజా కెరీర్‌లో ఇది ఒక కీలకమైన ఘట్టంగా నిలిచింది. లండన్‌లో ఇంత భారీ స్థాయిలో సింఫనీని ప్రదర్శించిన తొలి ఆసియా సినీ సంగీత దర్శకుడిగా ఆయన ఘనత సాధించారు. ఇక, భారతీయ సినీ సంగీతంలో పాశ్చాత్య శాస్త్రీయ సంగీత తత్త్వాలను మొదటగా ప్రవేశపెట్టిన సంగీత దర్శకులలో ఇళయరాజా ముందు వరుసలో ఉంటారు.

ఈ అద్భుతమైన సంగీత రాత్రికి సాక్షిగా నిలిచిన అభిమానులు ఆనందోత్సాహాలతో సోషల్ మీడియా ద్వారా తమ భావాలను పంచుకున్నారు. “అద్భుతం” అని ఒక అభిమాని రాస్తే.. మరొకరు “సింఫనీ కంపోజ్ చేసిన తొలి భారతీయుడు… మాస్ట్రో ఇళయరాజా” అని పోస్ట్ చేశారు. “నా గుండె వేగంగా కొట్టుకుంటోంది… సంగీత మేధావి స్వరంలో పాట. సింఫనీ వేదికపై… ” అంటూ తమిళ భాషలో అభిమానులు హర్షం వ్యక్తం చేశారు. ఈ ప్రతిష్టాత్మక లండన్ ఈవెంట్ ‘వేలియంట్’ సింఫనీకి ప్రపంచ ప్రీమియర్‌గా నిలిచింది. “ఇళయరాజా తొలి సింఫనీ ‘వేలియంట్’ను లండన్‌లో ప్రత్యక్షంగా వినడానికి అవకాశం రావడం నిజంగా అదృష్టంగా భావిస్తున్నాను. ఈ కచేరీ దిమిత్రి షోస్టకోవిచ్ యొక్క ఒక ప్రతిష్టాత్మక కృతితో ప్రారంభమై, ఆపై మాస్ట్రో యొక్క నాలుగు అద్భుతమైన సంగీత భాగాలతో కూడిన ‘వేలియంట్’ కొనసాగింది,” అని ఓ అభిమాని ట్వీట్ చేశారు.

81 ఏళ్ల వయసులో కూడా సంగీత ప్రపంచాన్ని మెస్మరైజ్ చేసే ఇళయరాజా, ‘వేలియంట్’ను రాయల్ స్కాటిష్ నేషనల్ ఆర్కెస్ట్రాతో కలిసి రికార్డ్ చేశారు. ఇటీవల, ఈ సింఫనీ రూపకల్పన వెనుక జరిగిన విశేషాలను వివరిస్తూ ఒక ప్రత్యేక వీడియోను షేర్ చేశారు. ఇళయరాజా త్వరలో విశాల్ నటిస్తున్న ‘తుప్పరివాళన్ 2’ సినిమాకు సంగీతం అందించనున్నారు.

Tags:    

Similar News