‘సర్దార్ 2’ డబ్బింగ్ షురూ
తమిళ స్టార్ హీరో కార్తీ ప్రధాన పాత్రలో నటిస్తున్న ‘సర్దార్ 2’ మూవీపై అంచనాలు తారాస్థాయికి చేరుకున్నాయి. ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఈ చిత్రానికి సంబంధించిన డబ్బింగ్ కార్యక్రమాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ప్రముఖ డబ్బింగ్ స్టూడియోలో సంప్రదాయ పూజా కార్యక్రమాలతో ఈ దశకు శ్రీకారం చుట్టారు. పీ.యస్. మిత్రన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ హైబడ్జెట్ స్పై థ్రిల్లర్‌లో కార్తీకి జోడీగా మలయాళ బ్యూటీ రజిషా విజయన్ నటించనుంది.
ఇప్పటివరకు కార్తీ కెరీర్‌లో అత్యంత ఖరీదైన చిత్రాల్లో ‘సర్దార్ 2’ ఒకటిగా నిలవనుందని చిత్ర యూనిట్ పేర్కొంది. మొదటి భాగం ‘సర్దార్’ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్న విషయం తెలిసిందే. సామాజిక సందేశంతో కూడిన ఈ చిత్రం నీటి సంరక్షణను ప్రధానంగా ప్రస్తావిస్తూ మంచి కమర్షియల్ హిట్‌గా నిలిచింది. ఆ విజయాన్ని గౌరవిస్తూ నిర్మాత లక్ష్మణ్ (ప్రిన్స్ పిక్చర్స్) దర్శకుడు పీఎస్ మిత్రన్‌కు టయోటా ఫార్చ్యూనర్ కారును బహుమతిగా అందించారు. ఇప్పుడు అదే స్థాయిలో ‘సర్దార్ 2’ కూడా కథా పరంగా, సాంకేతికంగా మరింత గ్రాండ్‌గా రూపొందుతోంది.
‘సర్దార్ 2’ కథ అంతర్జాతీయ స్థాయిలో విస్తరించనుంది. మొదటి భాగంలో కార్తీ డ్యూయల్ రోల్‌లో ఒకరు ‘రా’ ఏజెంట్‌గా, మరొకరు పోలీస్ ఆఫీసర్‌గా కనిపించారు. అయితే, ఈ సీక్వెల్‌లో కార్తీ ప్రభుత్వానికి స్పైగా పనిచేసే పాత్రలో కనిపించనున్నాడు. కథ ప్రధానంగా విదేశీ లొకేషన్లలో సాగనుండగా, కాంబోడియా ముఖ్యమైన నేపథ్యంగా ఉండబోతోంది. ఈ చిత్రం మరింత యాక్షన్ ప్యాక్డ్ ఎపిసోడ్స్‌తో ప్రేక్షకులను ఉర్రూతలూగించనున్నట్లు సమాచారం.
ఈ భారీ ప్రాజెక్టులో ఇంకా.. ఎస్‌జే సూర్య, మాళవిక మోహనన్, ఆశిక్ రంగనాథ్, సజల్ అహ్మద్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. టెక్నికల్ టీమ్ కూడా ఈ సినిమాకి బలాన్ని అందించనుంది. ప్రముఖ సినిమాటోగ్రాఫర్ జార్జ్ విలియమ్స్ సినిమాటోగ్రఫీని, యువన్ శంకర్ రాజా మ్యూజిక్‌ను అందిస్తున్నారు. టాప్ టెక్నీషియన్స్, స్టార్ కాస్ట్, గ్రిప్పింగ్ స్టోరీతో ‘సర్దార్ 2’ మరో విజువల్ వండర్‌గా ప్రేక్షకుల ముందుకు రానుంది.