'వార్ 2' చివరి ఘట్టం.. క్రేజీ స్టెప్పులతో క్లైమాక్స్!
బాలీవుడ్ స్పై యాక్షన్ సినిమాటిక్ యూనివర్స్‌లో మరో క్రేజీ ప్రాజెక్ట్‌గా రాబోతుంది 'వార్ 2'. అయాన్ ముఖర్జీ దర్శకత్వంలో యశ్‌రాజ్ ఫిల్మ్స్ నిర్మిస్తున్న ఈ సినిమాలో మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్, గ్రీక్ గాడ్ ఆఫ్ బాలీవుడ్ హృతిక్ రోషన్ కలిసి నటిస్తున్నారు. సౌత్, నార్త్ సమ్మేళనంగా రూపొందుతున్న ఈ క్రేజీ మల్టీస్టారర్ లో తారక్-హృతిక్ లను ఒకే ఫ్రేములో చూడడానికి ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
ఈ సినిమాలో ఎన్టీఆర్, హృతిక్ కలిసి సాలిడ్ యాక్షన్ సీక్వెన్స్‌లలో అదరగొట్టనున్నారట. వీరి మధ్య వచ్చే ఫైట్ సీన్స్, డైలాగ్స్ ఆడియన్స్ కు కొత్త అనుభూతిని అందిస్తాయనే కాన్ఫిడెంట్ తో ఉన్నారు మేకర్స్. ఇక డ్యాన్సుల్లో దుమ్మురేపే ఈ స్టార్స్ ఇద్దరూ కలిసి ఒక పాటలోనూ సందడి చేయనున్నారట. ఆ పాటతోనే ఈ సినిమాకి ప్యాకప్ చెప్పేయడానికి కసరత్తులు జరుగుతున్నట్టు తెలుస్తోంది.
ఈ పాట కోసం ప్రత్యేకంగా భారీ సెట్స్ వేస్తుండగా, ఈ డాన్స్ నెంబర్‌ని ప్రముఖ కొరియోగ్రాఫర్ బాస్కో మార్టిస్ నేతృత్వంలో తెరకెక్కించనున్నట్టు బాలీవుడ్ టాక్. బాస్కో గతంలో ఎన్టీఆర్ 'దేవర' కోసం 'చుట్ట మల్లే' పాటకు స్టెప్పులు సమకూర్చాడు. మొత్తంగా 'వార్ 2'లో తారక్-హృతిక్ డ్యాన్స్ నంబర్ ఏ రేంజులో ఊపేస్తుందో చూడాలి.