రష్యాలో కూడా విడుదలవుతోన్న విక్కీ కౌశల్ చిత్రం
బాలీవుడ్ కు రష్యాలో మంచి క్రేజ్ ఉండటంతో ‘ఛావా’ అక్కడ మంచి స్పందన పొందుతుందనే అంచనాలు ఉన్నాయి.;
బాలీవుడ్ యంగ్ స్టార్ .. విక్కీ కౌశల్, నేషనల్ క్రష్ రష్మిక మందన్నా జోడీగా నటించిన పీరియాడికల్ డ్రామా ‘ఛావా’. ఈ సినిమా రష్యాలో కూడా అదే రోజున విడుదల కానుంది. లక్ష్మణ్ ఉతేకర్ తెరకెక్కించిన ఈ సినిమా ఫిబ్రవరి 14న భారత్‌తో పాటు రష్యాలోనూ థియేటర్లకు రానుంది. బాలీవుడ్ కు రష్యాలో మంచి క్రేజ్ ఉండటంతో ‘ఛావా’ అక్కడ మంచి స్పందన పొందుతుందనే అంచనాలు ఉన్నాయి.
ఛత్రపతి శంభాజీ మహారాజ్ జీవితం ఆధారంగా రూపొందిన ఈ చిత్రంపై ట్రైలర్ విడుదల తర్వాత భారీ అంచనాలు పెరిగాయి. విజువల్ స్పెక్టాకిల్‌గా ఉండబోతున్న ఈ సినిమా కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే, సినిమాలోని ఓ పాట విషయంలో వివాదం తలెత్తింది. 1681లో సంభాజీ మహారాజ్ బుర్హాన్‌పూర్‌పై విజయం సాధించిన తర్వాత రాజ్యంలో జరిపిన సంబరాల నేపథ్యంలో చిత్రీకరించిన ఓ గీతానికి విమర్శలు ఎదురయ్యాయి. ఈ గీతాన్ని వెంటనే తొలగించాలని కొందరు అభ్యంతరం వ్యక్తం చేయడంతో, దర్శకుడు స్పందిస్తూ ఆ పాటను తీసివేస్తామని అధికారిక ప్రకటనలో తెలిపారు.
విక్కీ కౌశల్, రష్మిక మందన్నాతో పాటు ఈ చిత్రంలో అక్షయ్ ఖన్నా మొఘల్ చక్రవర్తి ఔరంగజేబ్ పాత్రలో నటిస్తున్నారు. అలాగే డయానా పెంటీ, ఆశుతోష్ రాణా, దివ్యదత్తా కీలక పాత్రలు పోషిస్తున్నారు. మాడాక్ ఫిలింస్ బ్యానర్‌పై దినేష్ విజన్ నిర్మించిన ఈ సినిమా విక్కీ కౌశల్ కు, రష్మికా మందన్నకు ఏ రేంజ్ లో పేరు తెస్తుందో చూడాలి.