ఒకే వేదికపై తమన్నా అండ్ విజయ్ వర్మ !

Update: 2025-03-15 10:34 GMT

బాలీవుడ్ యాక్టర్ విజయ్ వర్మ , సౌత్ మిల్కీ బ్యూటీ తమన్నా భాటియా విడిపోయారనే వార్తలు హల్‌చల్ చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే.. ఇప్పటి వరకు ఈ విషయంపై వారిద్దరూ అధికారికంగా స్పందించలేదు. ఇదిలా ఉండగా, హోలీ సందర్భంగా వారిద్దరూ ఒకే వేడుకలో పాల్గొనడం కొత్త చర్చలకు తెరలేపింది. బాలీవుడ్ నటి రవీనా టాండన్ తన ఇంట్లో హోలీ పార్టీ ఏర్పాటు చేయగా.. ఆ వేడుకకు తమన్నా భాటియా, విజయ్ వర్మ ఇద్దరూ హాజరయ్యారు.

అయితే విజయ్ వర్మ, తమన్నా భాటియా ఇద్దరూ రవీనా ఇంటికి వేర్వేరు సమయాల్లో వచ్చారు. ఇప్పుడిదే సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. వైరల్ అవుతున్న వీడియోల ప్రకారం.. విజయ్ వర్మ రవీనా ఇంటి దగ్గర కెమేరా మేన్ తో సరదాగా హోలీ ఆడాడు. మరోవైపు.. తమన్నా కూడా మీడియాలో బాగానే ఫోకస్‌ అయింది. అయితే, వారు హోలీ వేడుకలో కలిసి పాల్గొన్నారా లేదా? ఒకరినొకరు పలకరించుకున్నారా? అన్న ప్రశ్నలకు స్పష్టత లేదు.

వీడియోలు బయటకు వచ్చిన తర్వాత, వీరిద్దరూ విడిపోయారని నమ్మే వారు, మళ్లీ కలుస్తారని ఆశించే వారు సోషల్ మీడియాలో రకరకాల ఊహాగానాలు చేస్తున్నారు. రవీనా టాండన్ వారిద్దరినీ మళ్ళీ కలపాలని ప్రయత్నించిందా? లేకపోతే.. విడిపోయినా ఒకే వేడుకలో కనిపించాల్సిన అవసరం వచ్చిందా? అన్న ప్రశ్నలు ఆసక్తికరంగా మారాయి. అయితే, వారి సంబంధం గురించిన పుకార్లకు ముగింపు పలకేలా తమన్నా, విజయ్ వర్మ ఇంకా ఏదీ అధికారికంగా ప్రకటించలేదు. మరి ఫ్యూచర్ లో ఏమైనా ప్రకటిస్తారేమో చూడాలి.

Tags:    

Similar News