సూరజ్ బర్జాత్యా చిత్రానికి హీరోయిన్ దొరికేసింది !
బాలీవుడ్ సెన్సిబుల్ డైరెక్టర్ సూరజ్ బర్జాత్యా తన కొత్త సినిమాలో హీరో ఆయుష్మాన్ ఖురానాకు జోడిగా శర్వరిని ఎంపిక చేసినట్టు వార్తలు వస్తున్నాయి . ‘హమ్ సాథ్ సాథ్ హై’, ‘మేన్ ప్రేమ్ కి దీవానీ హూ’, ‘మైనే ప్యార్ కియా’, ‘హమ్ ఆప్కే హై కౌన్’ వంటి హిట్ చిత్రాలను అందించిన బర్జాత్యా, తన తాజా చిత్రానికి శర్వరినే కథానాయికగా నిర్ణయించినట్టు సమాచారం.
తాజా సమాచారం ప్రకారం.. అవసరమైన అమాయకత్వం, మృదుత్వం ఉన్న పాత్రకు శర్వరి పూర్తిగా సరిపోతుందనే నమ్మకంతో బర్జాత్యా ఆమెను ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. గత ఏడాది నుండి శర్వరీపై సినీ పరిశ్రమలో మంచి ఆసక్తి పెరిగింది. ఇప్పుడు ఒక దిగ్గజ దర్శకుడు సూరజ్ బర్జాత్యా ఆమెను కథానాయికగా ఎంచుకోవడం.. బీ టౌన్ లో ఆసక్తిగా మారింది.
2024 డిసెంబర్‌లో.. సూరజ్ బర్జాత్యా తన కొత్త చిత్రానికి హీరోగా ఆయుష్మాన్ ఖురానాను ఎంపిక చేసినట్టు ప్రకటించారు. గతంలో సల్మాన్ ఖాన్, షాహిద్ కపూర్, సోనూ సూద్‌లను 'ప్రేమ్' పాత్రలో చూపించిన బర్జాత్యా, ఈసారి కుటుంబ ప్రేక్షకులను ఆకట్టుకునేలా కొత్త హీరో కోసం వెతికారు. అలా ఆయుష్మాన్ ఖురానాను ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. ఈ సినిమా ద్వారా ఆయుష్మాన్ ఖురానా, శర్వరి మొదటిసారి జోడీగా నటిస్తుండడం మరో విశేషం. సినీ ప్రియులందరూ ఈ కొత్త జోడీపై ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.