సల్మాన్ ఖాన్, సంజయ్ దత్ హాలీవుడ్ చిత్రం?
బాలీవుడ్ స్టార్ హీరోలు సల్మాన్ ఖాన్, సంజయ్ దత్ ఒక ఇంటర్నేషనల్ భారీ బడ్జెట్ హాలీవుడ్ చిత్రంలో అతిథి పాత్రల్లో నటిస్తున్నారు. తాజాగా ఈ ప్రాజెక్ట్ గురించి మరింత సమాచారం లభించింది. సౌదీ అరేబియాలో తెరకెక్కుతున్న ఈ థ్రిల్లర్ చిత్రం ‘ది సెవెన్ డాగ్స్’. ఇందులో ప్రముఖ ఈజిప్షియన్ నటులు కరీం అబ్దెల్ అజీజ్, అహ్మద్ ఈజ్ ప్రధాన పాత్రల్లో కనిపించనున్నారు. బ్యాడ్ బాయ్స్: రైడ్ ఆర్ డై వంటి హిట్ చిత్రానికి దర్శకత్వం వహించిన అడిల్ ఎల్ అర్బి, బిలాల్ ఫల్లాహ్ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు.
సల్మాన్ ఖాన్, సంజయ్ దత్ పాత్రల గురించి అధికారిక సమాచారం బయటకు రానప్పటికీ.. సల్మాన్ తన పార్ట్ షూటింగ్ ను ఫిబ్రవరి 17న చిత్రీకరణ ప్రారంభించారని సమాచారం. ఈ చిత్రానికి సంబంధించిన ఆయన షూటింగ్ వీడియో ఇంటర్నెట్‌లో లీకైంది. రియాద్‌లోని ఓ మార్కెట్ సమీపంలోని విలన్ డెన్ లో సల్మాన్ సన్నివేశాలను చిత్రీకరించారు. బుధవారం షూటింగ్ పూర్తి చేసుకుని.. తన మేనల్లుడు అయాన్ అగ్నిహోత్రి మ్యూజిక్ సింగిల్ ప్రారంభోత్సవానికి దుబాయ్ వెళ్ళాడు సల్లూ భాయ్.
ఈ ప్రాజెక్ట్‌కు సల్మాన్ ఖాన్ భాగమవడం పెద్ద ఆశ్చర్యేమేమీ కాదు. ఎందుకంటే ఈ చిత్రాన్ని సౌదీ అరేబియా ఇండస్ట్రీ ప్రముఖుడు తుర్కీ అల్-షేక్ రచించారు. భారీ బడ్జెట్‌తో రూపొందుతున్న అరబిక్-భాషా చిత్రాల్లో ఇది అత్యంత ఖరీదైనదిగా చెప్పబడుతోంది. షేక్ ఈ ప్రాజెక్ట్‌పై ప్రత్యక్షంగా పర్యవేక్షణ చేస్తుండటంతో, బాలీవుడ్-హాలీవుడ్ కలయిక ఈ చిత్రానికి మరింత ప్రాధాన్యం తీసుకొచ్చింది. మరి ఈ సినిమాలోని సల్మాన్ అండ్ సంజయ్ దత్ క్యామియో పాత్రలు ఎలా ఉండబోతున్నాయో చూడాలి.