‘భజరంగి భాయిజాన్ 2’ కు సన్నాహాలు !
తాజా సమాచారం ప్రకారం, సల్మాన్ ఖాన్ స్వయంగా ‘బజరంగీ భాయిజాన్ 2’ కు సంబంధించి రచనాపరంగా సన్నాహాలు ప్రారంభించినట్టు తెలిసింది.;
భారతీయ సినీ చరిత్రలో కొన్ని చిత్రాలు ప్రేక్షకుల హృదయాల్లో చెరగని ముద్ర వేసుకుంటాయి. మానవత్వాన్ని, సానుభూతిని, దేశసరిహద్దులను దాటి మానవ సంబంధాలను అద్భుతంగా చిత్రీకరించిన అలాంటి చిత్రాల్లో ‘బజరంగీ భాయిజాన్’ ఓ ప్రత్యేకస్థానం సంపాదించుకుంది. 2015లో విడుదలైన ఈ సినిమా దేశ వ్యాప్తంగా మాత్రమే కాదు, అంతర్జాతీయంగా కూడా గొప్ప విజయాన్ని సాధించింది. బాలీవుడ్ మాస్ హీరో సల్మాన్ ఖాన్ నటనకు, దర్శకుడు కబీర్ ఖాన్ చూపించిన భావోద్వేగాలకు, చిన్నారి హర్షాలి మల్హోత్రా అమాయకత్వానికి ప్రేక్షకులు ఫిదా అయ్యారు.
ఈ సినిమాలో ప్రధానంగా పాకిస్థాన్‌కు చెందిన ఓ మూగ చిన్నారి మునిని (షాహిదా) ఆమె తల్లిదండ్రుల వద్దకు తిరిగి పంపించడానికి పవన్ కుమార్ చతుర్వేది (సల్మాన్) చేసే ప్రయాణం హృదయాన్ని తాకుతుంది. ఒక మానవతావాది పోరాటం, ఒక అన్యదేశ చిన్నారి కోసం చేసిన త్యాగం, ప్రేమను పంచే భారతీయత అన్ని కలగలిపిన ఈ చిత్రాన్ని ప్రేక్షకులు ఎప్పటికీ మరిచిపోలేరు.
ఇలాంటి క్లాసిక్‌కి సీక్వెల్ ఉంటుందా అనే సందేహం అప్పటి నుంచీ ప్రేక్షకుల్లో ఉంది. ఇప్పుడు ఆ ఆశలు నిజమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. తాజా సమాచారం ప్రకారం, సల్మాన్ ఖాన్ స్వయంగా ‘బజరంగీ భాయిజాన్ 2’ కు సంబంధించి రచనాపరంగా సన్నాహాలు ప్రారంభించినట్టు తెలిసింది. ఈ చిత్రం మొదటి భాగానికి కథను అందించిన ప్రముఖ రచయిత విజయేంద్రప్రసాద్‌తో ఇటీవల సల్మాన్ స్క్రిప్ట్ చర్చలు జరుపుతున్నారట.
మరోవైపు, మొదటి భాగాన్ని తెరకెక్కించిన దర్శకుడు కబీర్ ఖాన్ కూడా ఈ సీక్వెల్ అంశంపై ఆసక్తిగా ఉన్నట్టు తెలుస్తోంది. భావోద్వేగాలు నిండిన ఒక ప్రత్యేకమైన కథను మళ్లీ తెరపైకి తీసుకురావాలన్న ప్రయత్నం ఈ చిత్రబృందం చేస్తున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం స్క్రిప్ట్ రచన దశలో ఉన్న ఈ ప్రాజెక్ట్ అన్ని అనుకున్నట్టుగా జరిగితే త్వరలోనే అధికారిక ప్రకటన వెలువడే అవకాశాలు కనిపిస్తున్నాయి.