ఆ విషయంలో పదిసార్లు ఆలోచించాల్సి వస్తోంది : సల్మాన్ ఖాన్
"నేను అనన్య పాండే లేదా జాన్వి కపూర్‌తో నటించాలంటే పదిసార్లు ఆలోచించాలి. పదిసార్లు ఆలోచించి, తర్వాతే సినిమా చేయాలి," అని సల్మాన్ అన్నారు.;
బాలీవుడ్ సూపర్‌స్టార్ సల్మాన్ ఖాన్... తన సినిమాల్లో కథానాయికలతో వయస్సు తేడా పెరుగుతుండటంపై పెరుగుతున్న విమర్శలను ఎదుర్కొంటున్నారు. 59 ఏళ్ల సల్మాన్ తన రాబోయే చిత్రం "సికందర్" లో 31 సంవత్సరాల చిన్న వయస్కురాలైన రష్మిక మందన్నాతో జోడీ కడుతున్నారు. ఈ విషయమై జరుగుతున్న చర్చలపై స్పందించిన సల్మాన్.. నటీనటుల వయస్సుపై మీడియా ఎక్కువ దృష్టి పెడుతుండటంపై అసంతృప్తి వ్యక్తం చేశారు.
ఈ ధోరణి వల్ల సీనియర్ హీరోలకు కథానాయికల ఎంపిక మరింత క్లిష్టంగా మారిందని పేర్కొన్నారు. తనకు కన్నా చాలా చిన్నవయస్కులైన కథానాయికలతో నటించేందుకు తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సి వస్తుందని ఆయన యన్ డీ టీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో అన్నారు. "నేను అనన్య పాండే లేదా జాన్వి కపూర్‌తో నటించాలంటే పదిసార్లు ఆలోచించాలి. పదిసార్లు ఆలోచించి, తర్వాతే సినిమా చేయాలి," అని సల్మాన్ అన్నారు.
ఇక తెలుగు చిత్ర పరిశ్రమ విషయానికి వస్తే, సీనియర్ హీరోలు వయస్సులో చాలా తక్కువవయస్కులైన కథానాయికలతో నటించడం సర్వసాధారణంగా మారింది. ఉదాహరణకు, వెంకటేష్ ఇటీవల తన సినిమాల్లో తనకంటే 30 సంవత్సరాలు చిన్నదైన ఐశ్వర్యా రాజేష్, 35 సంవత్సరాలు చిన్నదైన మీనాక్షి చౌదరి వంటి కథానాయికలతో నటించారు. అలాగే చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున వంటి సీనియర్ నటులు కూడా తరచుగా యువ కథానాయికలతో జత కడుతున్నారు. అయితే, బాలీవుడ్‌లో ఈ అంశంపై విమర్శలు పెరుగుతుండటంతో సల్మాన్ ఖాన్ మాత్రం కథానాయికల ఎంపిక విషయంలో మరింత జాగ్రత్తగా వ్యవహరిస్తున్నట్టు కనిపిస్తున్నారు.